హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. రాష్ట్రపతికి కోటి దీపోత్సవం నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు. వారితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి సీతక్క కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీప ప్రజ్వలన చేసిన తర్వాత కోటి దీపోత్సవంలో పూరీ జగన్నాథునికి రాష్ట్రపతి ముర్ము ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి రాష్ట్రపతి పట్టువస్త్రాలు సమర్పించారు. తొలి కార్తీక దీపాన్ని రాష్ట్రపతి వెలిగించారు.
అంతకుముందు హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
రాత్రికి రాజ్ భవన్ లో బస చేయనున్నారు. రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్ మంథన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అంతర్జాతీయ జానపద కళారూపాల ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రేపు మధ్యాహ్నం తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళతారు.