ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఈసారి ఇజ్రాయెల్ అనే చెప్పాలి. తాజాగా సౌత్ లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన కాల్పుల్లో 22 మంది మృతి చెందారు. నిజానికి ఒప్పందం ప్రకారం ఈ ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ ఆర్మీ వెనక్కి వెళ్లిపోవాలి. కానీ వారు వెళ్లిపోకముందే వేలాది మంది ప్రజలు తిరిగి వచ్చారు. ఇందులో చాలా మంది హమాస్ జెండాలు పట్టుకొని ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇజ్రాయెల్ కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 22 మంది మరణించారు.
నిజానికి ఈ ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ ఆర్మీ వెనక్కి రావడానికి 30 రోజుల సమయం ఉంది. అయితే అప్పటికే ప్రజలు భారీగా తిరిగి రావడంతో ఉద్రిక్తత మొదలైంది. ఇప్పటికే ఇజ్రాయెల్ ఆర్మీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న అక్కడి ప్రజలంతా ఆందోళనలు, పలువురు దాడులు చేస్తున్నారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఈ ప్రాంతం నుంచి వెనక్కి వచ్చేందుకు తమకు మరికొంత సమయం కావాలని కోరుతోంది.
అయితే శాంతి ఒప్పందం అమలు, బలగాలు వెనక్కి వచ్చే విషయంలో కాస్త సందిగ్థత అయితే కొనసాగుతోంది. ఇజ్రాయెల్‌పై ప్రజలకు ఉన్న కోపాన్ని మళ్లీ తమకు అనుకూలంగా మలుచుకునేందుకు హమాస్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన క్యాంపెయిన్ ప్రారంభమైంది. ఇజ్రాయెల్ పాలస్తీనా వాసులను వేధించారంటూ అనేక వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో ప్రత్యక్షమవుతున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ బలగాలపై తాము జరుపుతున్న దాడులను కూడా వీడియోలుగా చేసి పోస్టులు చేస్తున్నారు. దీంతో పరిస్తితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది.
అయితే ఈ కాల్పులు ఇలాగే కొనసాగితే శాంతి ఒప్పందం కొనసాగుతుందా? లేదా? అనేది తేలాల్సి ఉంది. మరోవైపు హమాస్ మాత్రం ఇప్పటి వరకు దీనిపై అధికారికంగా స్పందించలేదు. దీంతో చర్చలు ముందుకు సాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. కానీ తెర వెనక ప్రజలను ముందు పెట్టి నాటకం ఆడితే మాత్రం ప్రపంచ దేశాల్లో ఇజ్రాయెల్ ఓ రక్త పిశాచిలా మిగలడం ఖాయం.