రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన మీద, సోకాల్డ్ ప్రజాపాలన మీద ప్రజల తిరుగుబాటు ప్రారంభమైందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మా భూముల మాకు కావాలని ఆ ప్రాంత ప్రజలు కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నారని, అక్కడ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి ఎందుకు పిలిచి మాట్లాడటం లేదని ప్రశ్నించారు. గూండాలతో, పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఓటు వేసి గెలిపిస్తే బాగు పడతామని ఆశపడ్డ రైతుల నోట్లో మట్టికొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ములాఖత్ అనంతరం చర్లపల్లి జైల్ వద్ద మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.
లగచర్ల గ్రామ ప్రజల మీద కర్కశంగా వ్యవహరిస్తున్న సిఎం కట్టుబట్టలతో ఊళ్లు వదిలి పారిపోయేలా చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అబద్దాలు చెబుతున్నరని, ప్రజా తిరుగుబాటు నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు.
హరీశరావు కామెంట్స్…
రాష్ట్రంలో ఎవరు తిరుగుబాటు చేసినా బీఆర్ఎస్ కుట్ర అంటున్నడు. అశోక్ నగర్ లో విద్యార్థులు తిరగబడితే బీఆర్ఎస్ కుట్ర అంటరు. రైతులు రోడ్ల మీదకు వస్తే బీఆర్ఎస్ కుట్ర అంటరు
పోలీసులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తే బీఆర్ఎస్ కుట్ర అంటరు. గురుకుల విద్యార్థులు నిరసన చేస్తే బీఆర్ఎస్ కుట్ర అంటరు. చివరకు సొంత నియోజకవర్గంలో భూముల కోసం గిరిజనులు పోరాడితే దీని వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందంటరు. ఏ వర్గాలైతే పోరాటం చేస్తున్నయో వారికి అండదండగా ఉండటం ప్రతిపక్షం బాధ్యత
పీడిత వర్గాలకు అండదండగా నిలబడటమే మా బాధ్యత. మాకు ఉద్యమాలు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు, నన్నో, కేటీఆర్ నో, మా ఎమ్మెల్యేలను అరెస్టు చేయండి కానీ అమాయక గిరిజన రైతులను అరెస్టులు చేయడం సరికాదు. మా భూమి మాకు కావాలి అని పోరాటం చేస్తే వేధిస్తరా. మీరు ఎన్ని రకాలుగా మమ్మల్ని వేధించినా మీ మోసపూరిత వైఖరి మీద బీఆర్ఎస్ చేసే పోరాటం ఆగదు.
ఇదేం ప్రజాస్వామ్యం. ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యం ఇస్తున్న అని చెప్పినవు. ఆరోజు మల్లన్న సాగర్ లో రెండు రోజులు నిరాహార దీక్ష చేసినవు. నీకు రక్షణ ఇచ్చినం కదా, నిన్ను అడ్డుకోలేదు, అరెస్ట్ చేయలేదు.
మా లీడర్ ఆఫ్ అపోజిషన్ మా మధుసూదనాచారి లగచర్లకు వెళ్తే అడ్డుకున్నవు. ఆర్ఎస్ ప్రవీణ్, కార్తీక్ రెడ్డి లను అడ్డుకున్నవు. ఎంపీ అరుణ వెళ్లకుండా అడ్డుకున్నవు.
తొమ్మిది నెలల గర్బిణీ చాతి మీద తొక్కుతూ ఇంట్లోకి వెళ్లారు. ఇదేనా మీరు చేసే పాలన? ఇదేనా ప్రజాపాలన? అక్రమంగా అరెస్టు చేసి నరేందర్ రెడ్డి, కేటీఆర్ మీద కేసులు పెడుతవు కావొచ్చు
నిన్ను గద్దె దించడం మాత్రం ప్రజలు మరిచిపోరు. హైదరాబాద్ లో 14వేల ఎకరాల్లో భూమి తయారు చేసిండు కేసీఆర్. ఫార్మాసిటీ కోసం ఉన్న భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తడట. పచ్చటి పొలాల్లో చిచ్చు బెడుతున్నడు. ఆనాడు ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన నేడు రాష్ట్రంలో కనిపిస్తున్నది
ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా?
ఫార్మా సిటీ పెట్టాలంటే గత ప్రభుత్వం సేకరించిన 14వేల ఎకరాల్లో పెట్టు. కొడంగల్, జహీరాబాద్ లలో పార్మాసిటీ భూముల సేకరణ నిర్ణయం ఉపసంహరించుకో. నీ ప్రాధాన్యం అదానీ, నీ ప్రాధాన్యం నీ అల్లుల్లు
దళిత, గిరిజన, పేదల పక్షాన మేం పోరాటం చేస్తం. బీఆర్ఎస్ పార్టీ నిలబడుతది. సమాధానం చెప్పలేక కేటీఆర్ మీద కుట్ర చేస్తున్నవు
నరేందర్ రెడ్డిని జైలులో పెట్టి భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించిన కొడంగల్ ప్రజల మీద నీ ప్రేమ ఇంతేనా రేవంత్ రెడ్డి. బడా ఫార్మా కంపెనీల మీద, నీ అల్లుడి మీద ప్రేమ ఉంది తప్ప రైతులు, గిరిజనుల మీద లేదు. బడా బాబులకు భూములు కట్టబెడుతరా
ముఖ్యమంత్రి ఉన్నది ఇందుకేనా?