రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
2047లో వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించిన తరువాత మాత్రమే ప్రధాని నరేంద్ర మోడీ ఆ పదవి నుంచి విరమణ తీసుకుంటారని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్రికా ఖండంలోని మొరాకో దేశ పర్యటనలో ఉన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్థానిక మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈసందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ పలు ఆసక్తిక ర వ్యాఖ్యలు చేశారు. భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఇంకా ఎంత కాలం ఆ పదవిలో కొనసాగుతారని ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు రాజ్‌నాథ్ సింగ్ సమాధానం చెపుతూ 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికలతో పాటు 2034, 2039, 2044లో జరిగే ఎన్నికల్లో సైతం మోడీనే ప్రధానిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. వికసిత్ భారత్‌ను ప్రధాని మోడీ తన వ్యక్తిగత లక్ష్యంగా తీసుకున్నారని ఈ సందర్భంగా రాజనాథ్ వెల్లడించారు. అది సాధించేంత వరకూ మోడీ విశ్రమించరని రాజనాథ్ తెలిపారు. 2047వ సంవత్సరానికి భారత దేశానికి స్వతంత్ర్యం వచ్చి శతాబ్ది కాలం పూర్తవుతుందని అప్పటికి మేము వికసిత్ భారత్ లక్ష్యానికి చేరుకుంటామని రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. భారత దేశం ఈ లక్ష్యానికి చేరుకున్న తరువాతే నరేంద్ర మోడీ పదవీ విరమణ చేస్తారని రాజనాథ్ వ్యాఖ్యానించారు.