ముంబైలో కరోనా భయం అలుముకుంది. ఇద్దరు మహిళలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. అయితే, వాళ్లు కరోనాతో చనిపోయారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మళ్లీ కొవిడ్ వ్యాపిస్తోందంటూ ఆందోళన చెందారు. అయితే, ఈ ప్రచారం ప్రజల్లో భయాలు రెచ్చగొడుతుండటంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ – బీఎంసీ రెస్పాండ్ అయ్యింది. ప్రజలెవరూ భయపడొద్దని, కరోనా మరణాలంటూ జరుగుతున్న ప్రచారం అబద్ధమని తేల్చి చెప్పింది.
ముంబైలోని సింధుదుర్గ్, డోంబివ్లి ప్రాంతాలకు చెందిన ఇద్దరు మహిళలు ఆదివారం ముంబైలోని ఓ ఆసుపత్రిలో మరణించారు. అయితే, వాళ్లిద్దరి మరణాలకు కరోనా కారణం కాదని బీఎంసీ స్పష్టం చేసింది. హైపోకాల్సెమిక్ మూర్ఛలతో పాటు నెఫ్రోటిక్ సిండ్రోమ్, క్యాన్సర్ వంటి ఇతర అనారోగ్య కారణాలతోనే వారు మరణించారని అధికారులు వెల్లడించారు. ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సింగపూర్, హాంకాంగ్, తూర్పు ఆసియా దేశాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ముంబైలోనూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఎంసీ సూచించింది.
కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆరోగ్య శాఖ నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తోందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు నగరంలో కొవిడ్ కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయని, మే నెల నుంచి కొద్దిగా పెరుగుదల కనిపించిందని తెలిపారు. అయినప్పటికీ, పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో కరోనా రోగుల కోసం 20 ఐసీయూ పడకలు, పిల్లలు, గర్భిణీ స్త్రీల కోసం 20 పడకలు, 60 సాధారణ పడకలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ముఖ్యంగా క్యాన్సర్, మధుమేహం, అధిక రక్తపోటు, కాలేయ వ్యాధులు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బీఎంసీ కోరింది. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, అలసట, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.