24.2 C
Hyderabad
Monday, October 20, 2025

Live Video

spot_img

కలిసి చదివారు… కలిసే బ్లాస్టులు ప్లాన్ చేస్తున్నారు

హైదరాబాద్‌‌లో పేలుళ్ల కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. విజయనగరంలో ఉగ్రమూలాలు ఉండటం కలకలం రేపుతోంది. నిందితులు సిరాజ్‌, సమీర్‌ రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించారు. సిరాజ్‌, సమీర్‌తోపాటు టీమ్‌లో మహారాష్ట్ర యువకులు ఉన్నారు. మొత్తం ఆరుగురు వ్యక్తులు టీంలో ఉండటంతో ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. నిందితులు ఆరుగురు గ్యాంగ్‌ హైదరాబాద్‌లో 3 రోజులపాటు కలిసి ఉన్నారు. ఐసిస్‌ (ISIS) హ్యాండ్లర్‌ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాలు అమలు చేయడంపై సమావేశమై చర్చించేవారు.

టిఫిన్‌ బాక్స్‌ బాంబులు తయారు చేయాలని ఇద్దరికి ఆదేశాలు సైతం వచ్చాయని గుర్తించారు. ఆ గ్రూపులోని మిగతా నలుగురికి బాంబ్‌లు పెట్టే ప్రాంతాల గుర్తింపును టార్గెట్‌ ఇచ్చినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. తమకు ఆదేశాలు రావడంతో  వాటి తయారీ కోసం టిఫిన్‌బాక్స్‌లు, వైర్లు, రిమోట్‌ సెల్స్‌ అమెజాన్‌లో ఆర్డర్ చేశాడు సిరాజ్‌. ఈ క్రమంలో విజయనగరంలో సిరాజ్, హైదరాబాద్‌లో సమీర్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం కోర్టు ఇద్దరికీ 14 రోజులు రిమాండ్ విధించింది. అరెస్టు సమయంలో సిరాజ్ వద్ద భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. సిరాజ్ వద్ద పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు అమ్మోనియం నైట్రేట్, సల్ఫర్‌, అల్యూమినియం పౌడర్ సీజ్ చేసినట్లు తెలిపారు.

ఎన్ఐఏ అధికారులు ఈ కేసు వివరాల కోసం విజయనగరం టూ టైన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. కేసు విచారణలో వారికి లభ్యమైన ఆధారాలు, వివరాలను ఎన్ఐఏ అధికారులు విజయనగరం పోలీసులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాదు బోయగూడలో ఉండే సయ్యద్ సమీర్, విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ అనే యువకులు 2018లో హైదరాబాద్ సిటీలో కలిసి చదివారు. ఈ క్రమంలో వారు  తీవ్రవాద భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. వీరు “ఆల్ హింద్ ఇత్తయ్ హాదుల్ ముస్లిమీన్” అనే సంస్థను నడుపుతున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. సౌదీ అరేబియా కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలతో లింకులు ఉన్నాయని గుర్తించారు.

పహల్గాంలో ఉగ్రదాడి తరువాత దేశంలో పలుచోట్ల ఉగ్ర కదలికలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో జ్యోతి మల్హోత్రా అనే హర్యానాకు చెందిన ఫేమస్ యూట్యూబర్ అరెస్ట్ అయింది. ఆమె పలుమార్లు పాకిస్తాన్ వెళ్లి హైకమిషన్ అధికారులతో చర్చలు జరుపుతోంది. దాడులకు ముందు పహాల్గాంలోనూ జ్యోతి వీడియోలు చేసి పోస్ట్ చేసింది. దేశ వ్యాప్తంగా ఉగ్ర కదలికలపై నిఘాపెట్టిన పోలీసులు పాక్ ప్రేరేపిత సంస్థలు, ఉగ్రవాదులకు సమాచారం చేరవేస్తున్న వారిపై చర్యలు చేపట్టారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com