తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ప్రహాసనంగా మారింది. ఇదిగో.. అదిగో.. అన్నారు. కొందరైతే డేట్ కూడా ఫిక్స్ చేశారు. తీరా చూస్తే ఏదీ లేదు. వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడనేది.. అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ కామెంట్స్‌తో మరోసారి కేబినెట్ అంశం తెరపైకొచ్చింది. మంత్రివర్గ విస్తరణ ఎవరి పరిధిలో ఉంటుందన్న టాపిక్‌పై తెలంగాణలో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. తాజా పరిణామాలతో ఇప్పట్లో కేబినెట్ విస్తరణ కష్టమేనన్న సంకేతాలతో కొన్నాళ్లుగా నేతలంతా సైలెంట్ అయిపోయారు.
అయితే మంత్రివర్గ విస్తరణపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు తెరలేపాయి. కేబినెట్ విస్తరణ అంశం ముఖ్యమంత్రి పరిధిలో ఉందంటూ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. మొన్నటిదాకా కేబినెట్ విస్తరణ అంశం కాంగ్రెస్ హైకమాండ్ చేతిలో ఉంటుందని చెబుతూ వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ కోసం కష్టపడ్డ నాయకులనే మంత్రి పదవి వరిస్తుందని.. ఆ నేతలు ఎవరనేది మాత్రం నిర్ణయించేది అధిష్టానమే పదేపదే చెప్పారు రేవంత్‌రెడ్డి.
ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల కోసం ఆశావాహులు అధిష్టానం పెద్దలను కలవడం, లేఖలు రాయడం జరిగింది. విస్తరణపై సీనియర్ నేత జానారెడ్డి హైకమాండ్‌కు లెటర్ రాశారు. రంగారెడ్డి జిల్లాకు ఛాన్సివ్వాలని ఖర్గేకు, కేసీ వేణుగోపాల్‌కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఓ అడుగు ముందుకేసి.. తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకే రాజీనామా చేస్తానంటూ పార్టీ పెద్దలకే అల్టిమేటం ఇచ్చారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గడ్డం సోదరులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టారన్న ప్రచారం జరిగింది. ఇటు నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సైతం ఢిల్లీ పెద్దలతో లాబీయింగ్ జరిపినట్లు జోరుగా ప్రచారం నడిచింది. ఇలా ఒక్కరేంటి… మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలన్న తపనతో ఎందరో నేతలు హస్తినబాట పట్టారు. మరికొందరు విజ్జప్తి లేఖలు ఢిల్లీకి పంపారు.
అయితే మంత్రివర్గంలో బీసీలకు సింహభాగం కేటాయించాలని రాహూల్ గాంధీ ఒత్తిడి చేయటంతో ముఖ్యమంత్రి కినుక వహించారని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో అగ్రవర్ణాల నుంచి ఒత్తిడి అధికంగా ఉంది. బీసీలకు పెద్దపీట అని చెప్పుకుంటున్న ప్రభుత్వంలో బీసీలకు తగిన స్థానం కల్పించకపోతే ప్రతిపక్షాలకు అస్త్రంగా మారే అవకాశం ఉంది.