కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీయం రేవంత్‌రెడ్డి
రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ భాగాలతో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణం విషయంలో పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డుతో పాటు రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పలు జాతీయ రహదారుల పురోగతిపై సీయం రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులు, జిల్లా కలెకర్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి బందరు పోర్టు వరకూ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం విషయమై అధికారులతో సీయం సమీక్షించారు. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకు సంబంధించి వీలైనంత త్వరగా రూట్ మ్యాప్ పై తుది నిర్ణయం తీసుకోవాలని సీయం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే హైదరాబాద్, శ్రీశైలం హైవే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అవసరమైన అనుమతులు కేంద్ర నుంచి వెంటనే తీసుకోవాలని సూచించారు. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లతో సీయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను రేవంత్‌రెడ్డి ఆదేశించారు. భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం అందిచాలని సీయం ఆదేశించారు. అక్టోబర్ నెలాఖరు నాటికి భూసేకరణ ప్రక్రియను సంపూర్ణంగా పూర్తి చేయాలన్నారు. ఎక్కడైనా భూ సేకరణ విషయంలో న్యాయ పరమైన సమస్యలు ఉత్పన్నమైతే ఆ వివరాలను ఉన్నతాధికారులకు అందించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు సూచించారు.