తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలో ఒక నూతన విప్లవానికి శ్రీకారం చుట్టింది. భూమికి సంబంధించి రికార్డుల నిర్వహణను మరింత సాంకేతికంగా, పారదర్శకంగా, అందరికీ సులభంగా అందుబాటులో ఉండేలా చేయాలనే లక్ష్యంతో భూభారతి పోర్టల్ ను ప్రారంభించింది.
ఈ పోర్టల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఏప్రిల్ 14వ తేదీన శిల్పకళా వేదికలో అధికారికంగా ప్రారంభించారు. భూభారతి ద్వారా భూమి వివరాలు తెలుసుకోవడం, సేవలు పొందడం ఇప్పుడు మరింత సులభతరంగా మారబోతోందని ప్రభుత్వం చెబుతోంది.
భూభారతి పోర్టల్ – ముఖ్యాంశాలు:
భూమి రికార్డుల డిజిటలైజేషన్
ఈ పోర్టల్ ద్వారా భూమికి సంబంధించిన రికార్డులు అన్నీ డిజిటల్ రూపంలో లభిస్తాయి. యజమాని పేరు, భూమి పరిమాణం, స్థలం వంటి అన్ని వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు.
జీపీఎస్ ఆధారిత సర్వేలు :
భూముల సరిహద్దులను ఖచ్చితంగా గుర్తించేందుకు జీపీఎస్ ఆధారిత సర్వేలు నిర్వహించనున్నారు. దీనివల్ల భూ వివాదాలు తగ్గే అవకాశముంది.
భూధార్ నంబర్ ద్వారా గుర్తింపు :
ప్రతి భూమికి ప్రత్యేకమైన భూధార్ నెంబర్ ఇవ్వబడుతుంది. దీనివల్ల భూమిని త్వరగా గుర్తించడం, రికార్డులను ట్రాక్ చేయడం సులభం అవుతుంది.
ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్ని సేవలు :
రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌లు, అప్పీల్స్, సమీక్షలు, భూమి వినియోగ మార్పు వంటి అనేక సేవలను ఒకే పోర్టల్‌లో పొందే అవకాశం కలుగుతుంది.
అప్పీల్ వ్యవస్థ :
భూమికి సంబంధించిన వివాదాలు న్యాయస్థానాలకు వెళ్లకుండానే రెవెన్యూ శాఖ స్థాయిలో పరిష్కరించేందుకు ఇందులో అప్పీల్ వ్యవస్థను ఏర్పాటుచేస్తున్నారు.
భూభారతి – పైలట్ ప్రాజెక్టు :
ప్రస్తుతం ఈ పోర్టల్‌ను రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే, రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు.
భూభారతి పోర్టల్ ద్వారా ల్యాండ్ రికార్డ్స్ ఎలా చెక్ చేయాలి?
భూమికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం ఇప్పుడు మీ ఇంటి దగ్గర నుంచే సులభంగా చేయవచ్చు. భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఈ సమాచారం మీకు అందుతుంది.
స్టెప్ బై స్టెప్ గైడ్ :
స్టెప్ 1 :
ముందుగా భూభారతి అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి:
[https://bhubharatitelangana.gov.in](https://bhubharatitelangana.gov.in)
స్టెప్ 2 :
హోమ్‌పేజీలో కనిపించే ల్యాండ్ డీటెయిల్స్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3 :
మీ భూమి వివరాల కోసం మీ జిల్లా, మండలం, గ్రామం వివరాలు ఎంచుకోండి. లేకపోతే పట్టాదారు పాసుబుక్ నెంబర్ లేదా సర్వే నెంబర్ ద్వారా కూడా సెర్చ్ చేయవచ్చు.
స్టెప్ 4 :
మీకు తెలిసిన వివరాల ఆధారంగా అవసరమైన నెంబర్ (పట్టా నెంబర్ లేదా సర్వే నెంబర్) ఎంటర్ చేసి “Search” బటన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 5 :
మీరు ఎంటర్ చేసిన వివరాల ఆధారంగా భూమి వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. అందులో కింది వివరాలు ఉంటాయి:
– యజమాని పేరు
– భూమి పరిమాణం
– గ్రామం, మండలం, జిల్లా
– భూధార్ నెంబర్
– రిజిస్ట్రేషన్ వివరాలు
– మ్యుటేషన్ స్టేటస్
ఈ వివరాలను మీరు అవసరమైతే ప్రింట్ తీసుకోవచ్చు.
అయితే, ప్రస్తుతం ఈ పోర్టల్ పైలట్ ప్రాజెక్టుగా పనిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.