సౌదీ అరేబియాకు వెళ్లాలనుకుంటున్నారా? కాస్త ఆగండి. కొత్త వీసా రూల్స్ గురించి తెలుసుకోండి. అవును.. సౌదీ అరేబియా సర్కారు ఉన్నట్టుండి షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఉన్నఫళంగా ఆ నిర్ణయాన్ని అమలు చేయడం మొదలుపెట్టింది. ఇవాల్టినుంచే సౌదీ అరేబియా ఆ కొత్త రూల్స్ ఫాలో అవుతోంది. ఉద్యోగం కోసం సౌదీ అరేబియా వెళ్లాలనుకునే భారతీయులకు ఈ కొత్త నిబంధనలు అడ్డుకట్టగా మారాయి.
ఇప్పటినుంచి సౌదీ అరేబియాలో వర్క్ వీసాకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్లు తప్పనిసరిగా వృత్తిపరమైన, విద్యా అర్హతలకు సంబంధించి న వెరిఫికేషన్‌ను ముందుగానే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు సౌదీలోని భారత దౌత్య కార్యాలయం ఓ సర్క్యులర్ జారీ చేసింది.
ఉపాధి కోసం తమదేశానికి వచ్చే విదేశీయులను కట్టడి చేసే ఉద్దేశ్యంతో సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భారతీయులకు షాక్ ఇచ్చింది. తమ దేశానికి వచ్చేవాళ్లను నియంత్రించడంలో భాగంగా సౌదీ అరేబియా ఈ నిర్ణయంత ఈసుకుంది. సాధారణంగా భారత్ నుంచి ఉద్యోగం, ఉపాధికోసం ఎక్కువ మంది సౌదీ అరేబియా వెళ్తుంటారు. దీంతో, ఈ నిర్ణయం సౌదీకి వెళ్లాలనుకునేవాళ్లకు ఇబ్బందికరంగా మారింది. భారతదేశానికి చెందిన స్కిల్డ్ ఉద్యోగులు కెరీర్‌కోసం ఉపాధి, ఉద్యోగం కోసం ఎక్కువగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్తుంటారు. అయితే, అన్‌స్కిల్డ్ లేబర్ ఎక్కువగా భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్తుండటం తెలిసిందే. అన్‌స్కిల్డ్ లేబర్ కావడంతో వృత్తి నైపుణ్యానికి సంబంధించి, విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు చాలామందికి ఉండవు. వీళ్లంతా ఎక్కువగా ఇళ్లల్లో పనులు చేయడం, భవన నిర్మాణ పనుల్లో చేరడానికి, ఎడారి దేశాల్లో ఒంటెలను కాయడం వంటి పనులు చేసేందుకు గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. ఇవే కాకుండా చాలా ఉద్యోగాలు, పనులు చేసేందుకు కూడా గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. అక్కడి ప్రజలకు అవసరమైన పనులు చేస్తూ.. ఆయా దేశాల అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే.. ఇప్పుడు అలా ఉపాధి కోసం తమ దేశానికి వస్తున్న వాళ్లకు కొన్ని నిబంధనలు, షరతులు పెట్టాలని సౌదీ అరేబియా ప్రభుత్వం నిర్ణయించింది.
ఇక నుంచి సౌదీ అరేబియా వర్క్ వీసాకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు తప్పనిసరిగా విద్య, వృత్తి అర్హతలకు సంబంధించి ముందుగానే వెరిఫికేషన్ పూర్తి చేయించుకోవాలి. ఇప్పటిదాకా ఫేక్ సర్టిఫికెట్లు చూపిస్తూ సౌదీ అరేబియాకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని ఆ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే.. ఇలాంటి అక్రమాలను అడ్డుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ అరేబియా ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. అయితే, ముందస్తు హెచ్చరికలు, ప్రకటనలు లేకుండానే.. ఈ కొత్త వీసా నిబంధనలు సౌదీలో ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. సౌదీ అరేబియాలోని ఇండియన్ ఎంబసీ ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది. సౌదీలో వర్క్ వీసా జారీ చేసేందుకు ప్రొఫెషనల్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేర్చినట్లు వెల్లడించింది. ఈ కొత్త విధానం ప్రకారం.. వర్క్ వీసాలతో సౌదీ అరేబియాకు వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్న వారి సర్టిఫికెట్లను తామే జారీ చేసినట్లు ఆయా మ్యాన్‌పవర్ సంస్థలు ధృవీకరించాల్సి ఉంటుంది.
అయితే,ఈ కొత్త నిబంధనలు తీసుకువచ్చేందుకు సౌదీ అరేబియా ప్రభుత్వం.. గడిచిన ఆరు నెలల నుంచి కసరత్తులు చేస్తోందట. సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ నిబంధనలు తీసుకురావడానికి వేర్వేరు కారణాలు చెబుతున్నప్పటికీ.. అసలు కారణం మాత్రం భారత్ నుంచి ఉపాధి కోసం భారీగా వచ్చేవారిని నియంత్రించడమే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఉద్యోగాలు, ఉపాధి కోసం గల్ఫ్ దేశమైన సౌదీ అరేబియాకు వెళ్తున్న వాళ్లలో భారతీయులే అధికం. అక్కడ ఉపాధి పొందుతున్న విదేశీయుల్లో భారతీయలు రెండో స్థానంలో ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. సౌదీ అరేబియాలో 24 లక్షల మందికిపైగా భారతీయులు ఉపాధి పొందుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 8 లక్షల మంది ఇళ్లల్లో పని చేస్తున్నారు. భారత్ కంటే అధికంగా బంగ్లాదేశ్ వాసులు.. సౌదీ అరేబియాలో ఎక్కువ మంది ఉన్నారు. సౌదీ అరేబియాలో 27 లక్షల మంది బంగ్లాదేశీయులు ఉపాధి పొందుతున్నారు.