31.2 C
Hyderabad
Saturday, April 4, 2026

Live Video

spot_img

టూరిజం హబ్‌గా రామగిరి ఖిల్లా – కేంద్రమంత్రి షెకావత్‌కు శ్రీధర్‌బాబు విజ్ఞప్తి

– ఆధ్యాత్మిక సర్క్యూట్‌గా ‘కాళేశ్వరం – మంథని – రామగిరి’
– కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయాభివృద్ధికి సహకరించండి
– కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి

మంథని, పెద్దపల్లి ప్రాంతంలోని ప్రాముఖ్యత కలిగిన చారిత్రక రామగిరి ఖిల్లాను టూరిజం హబ్‌గా అభివృద్ధి చేసేందుకు చొరవ చూపాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. అలాగే, ‘కాళేశ్వరం – మంథని – రామగిరి ఖిల్లా’ను ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటక సర్క్యూట్‌గా గుర్తించాలని కేంద్రమంత్రి షెకావత్‌కు ప్రతిపాదించారు మంత్రి శ్రీధర్‌బాబు.

ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి శ్రీధర్ బాబు.. బుధవారం కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను కలిశారు. పలు అంశాల గురించి చర్చించారు. మంథని నియోజకవర్గ పరిధిలోని కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం, రామగిరి కోటను టూరిజం హబ్‌గా అభివృద్ధి చేసేందుకు చొరవ చూపాలని వినతి పత్రం అందజేశారు. ‘దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరంలో గోదావరి నది ఒడ్డున వెలిసిన కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయానికి వేయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. దేశంలో ఎక్కడా కనిపించని విధంగా గర్భ గుడిలో రెండు శివలింగాలు పూజలందుకుంటున్నాయి. ఒకటి ముక్తేశ్వరునిది (శివుడు), మరొకటి కాళేశ్వరునిది (యముడు). ఏటా లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. ఈ ఏడాది మేలో సరస్వతి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. 30 లక్షల నుంచి 40 లక్షల మంది ఇక్కడ పవిత్ర స్నానాలను ఆచరించేందుకు వస్తారని అంచనా వేస్తున్నాం. ఇక్కడే 2027లోనూ గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. అప్పుడు కోటి మందికి పైగా వచ్చే అవకాశముంది. సోమ్ నాథ్, కేదార్ నాథ్, మహాకాళేశ్వర్, అయోధ్య, కాశీ ల మాదిరిగా ఎంతో ప్రత్యేకత కలిగిన కాళేశ్వర, ముక్తీశ్వర ఆలయాన్ని కూడా ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక, ఎకో టూరిజం హబ్ గా అభివృద్ధి చేసేందుకు పుష్కలంగా అవకాశాలున్నాయి. ఇప్పటికే ఈ ప్రతిపాదనలకు సంబంధించి సమగ్ర ప్రణాళికను రూపొందించాం. దీని అమలుకు కేంద్రప్రభుత్వం సహకరించాలి. భక్తుల సౌకర్యార్థం పుష్కరాలు మొదలయ్యే నాటికి ఈ అభివృద్ధి పనులను పూర్తి చేసేలా చొరవ చూపాలి’ అని శ్రీధర్‌బాబు కేంద్రమంత్రి షెకావత్‌కు విజ్ఞప్తి చేశారు. ‘ఈ ప్రాంతంలోని ప్రజలు రామగిరి ఖిల్లాగా పిలుచుకునే రామగిరి కోటకు సుమారు 1200 ఏళ్ల చరిత్ర ఉంది. రామాయణంలోనూ దీని గురించిన ప్రస్తావన ఉంది . రాముడి ఆలయాలు, జలపాతాలు, ఎన్నో ఔషధ మొక్కలు ఇక్కడున్నాయి. ఒక ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రానికి కావాల్సిన అన్ని ఆకర్షణలు రామగిరి కోటలో ఉన్నాయి. ఈ కోటను సందర్శించేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తున్నారు. స్వదేశీ దర్శన్ 2.0 లేదా ఇతర పథకాల కింద ఈ కోటను మెగా టూరిజం హబ్ గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలి’ అని కూడా శ్రీధర్‌బాబు కేంద్రమంత్రిని కోరారు.

రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు ప్రతిపాదనలకు కేంద్రమంత్రి షెకావత్‌ సానుకూలంగా స్పందించారు. అక్కడి ప్రాశస్త్యానికి అనుగుణంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com