- స్వతంత్ర సంస్ధలు విచారణ చేస్తున్నాయి…
- తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు
- ప్రధాని మోడీ పర్యటనపై దృష్టి పెట్టండి
- యోగాడేలో 5లక్షల మంది పాల్గొనేలా ప్లాన్ చెయ్యండి
మద్యం కుంభకోణానికి సంబంధించి మంత్రలు ఎవరూ తొందరపడి బయట ఎటువంటి కామెంట్లు చేయద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ సచివాలంయలో చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి భేటీ అయ్యింది. ఈ సందర్భంగా చంద్రబాబు లిక్కర్ స్కామ్ కేసు, అరెస్టులపై క్యాబినేట్ లో సుదీర్ఘంగా చర్చించారు. లిక్కర్ విషయంలో మంత్రులు ఆచితూచి స్పందించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్రాలకు చెందిన స్వతంత్ర సంస్ధలు లిక్కర్ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్నాయని, విచారణ పారదర్శకంగా జరుగుతోందని చంద్రబాబు మంత్రివర్గ సహచరులకు వివరించారు. ఈ వ్యవహారంలో డీటైల్డ్ విచారణ జరుగుతోందని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వంలో చట్టబద్ద పాలన ఉంటుందని, తప్పు చేస్తే వదిలే ప్రసక్తే లేదని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని క్యాబినేట్ సమావేశంలో స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. మంగళవారం జరిగిన క్యాబినేట్ సమావేశానికి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరై లిక్కర్ స్కామ్ లో జరుగుతున్న విచారణ, అరెస్టులు, తదుపరి తీసుకోబోయే చర్యలను మంత్రులు అందరికీ వివరించారు. ఇక ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో జరిగే కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరు కానున్నందున ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై దృష్టి పెట్టాలని సీయం చంద్రబాబు మంత్రులను ఆదేశించారు. వచ్చే నెల రోజుల పాటు మంత్రులందరూ ప్రధాని పర్యటన సక్సెస్ చెయ్యడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జూన్ 19, 20వ తేదీల్లో రెండు రోజుల పాటు యోగ రిహార్సిల్స్ ఉంటాయని తెలిపారు. జూన్ 21న విశాఖలో ప్రధాని పాల్గొనే వరల్డ్ యోగా డే కార్యక్రమానికి ఐదు లక్షల మంది పాల్గొనేలా ప్లాన్ చేయాలన్నా్రు. త్వరలో సంక్షేమ పథకాల క్యాలండర్ విడుదల చేద్దామని చంద్రబాబు మంత్రులకు చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని వీటిపై మంత్రులు ఎక్కువ ఫోకస్ పెట్టాలని సూచించారు. నీటిపారుదల ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం, కేంద్ర ప్రాజెక్టులు ఇలా అనేక మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతోందని, వీటి ఫలితాలు త్వరలోనే వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినేట్ కు వివరించారు.