హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా.. తెలంగాణకు వచ్చిన మిస్ వరల్డ్ జర్మనీ ప్రతినిధి సిల్వీ తెలుగులో ఇరగదీశారు. తనకు తెలుగుభాషపై ఉన్న అభిమానం, భారత సంస్కృతి పట్ల ఉన్న గౌరవాన్ని వ్యక్తం చేశారు. భాస్కరా న్యూస్ కు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూను తెలుగుతోనే ప్రారంభించారు. “నమస్కారం”, “ఎలానారూ” వంటి తెలుగు మాటలు పలకడంతో పాటు, అల్లు అర్జున్ నటించిన “బుట్ట బొమ్మ” పాటను కూడా గుర్తు చేస్తూ పొలిటెంట్ మీడియా ప్రతినిధినే ఆశ్చర్యపోయేలా చేశారు.
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 15 భాషలు నేర్చుకున్నానని, భారతీయ భాషలంటే తనకెంతో ఇష్టమని, అందులో తెలుగు కూడా నేర్చుకుంటున్నట్లు చెప్పారు. భారత సంస్కృతి, ఆహారం, సినిమాలు అన్నీ కూడా తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, అలియా భట్, దీపిక పదుకొణే వంటి నటుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఇంతకు ముందు ఢిల్లీ, తాజ్‌మహల్, రాజస్థాన్, ముంబయి వంటి ప్రాంతాలను సందర్శించానని, బాలీవుడ్‌లో ఒక సంవత్సరం పనిచేయాలన్న కోరిక తనకు ఉందని అన్నారు. ఉర్దూ, హిందీ భాషలపైనా తన మక్కువను తెలియజేశారు. “భారత్ చాలా అందమైన దేశం” అంటూ మిస్ జర్మనీ సిల్వీ ప్రశంసించారు.