తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మరోసారి అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. సూర్యాపేట జిల్లాలో ఈ ఊహించని సంఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కోదాడలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. మంత్రి పర్యటన లో భాగంగా హెలికాప్టర్ హుజూర్ నగర్ మండలం మేళ్లచెరువులో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే, వాతావరణ శాఖ సూచన మేరకు, అకస్మాత్తుగా కమ్ముకున్న మబ్బులు, బలమైన గాలి వాన నేపథ్యంలో పైలట్ అప్రమత్తమై కోదాడలో అత్యవసర ల్యాండింగ్ చేశాడు. ఎలాంటి ప్రమాదం జరగకుండానే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్షేమంగా హెలికాప్టర్ నుంచి దిగారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన హుజూర్ నగర్‌కు బయలుదేరి వెళ్లారు. గతంలోనూ పలు మార్లు మంత్రులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లు అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మరోసారి ఇలా జరగడం అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. అయితే, పైలట్ క్షేమంగా ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.