నేటి టెక్నాలజీ యుగంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులు మోయలేని భారంగా మారుతున్నాయి. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ చదివించాలంటేనే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రాష్ట్రంలో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు రూ.40 వేల నుంచి మొదలవుతున్నాయి. కానీ, అదే ప్రాంతంలో ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో చదివించాలంటే మాత్రం ప్రీ ప్రైమరీకే రూ.లక్ష నుంచి రూ.2 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఎల్‌కేజీకి డొనేషన్ రూపంలో లక్ష రూపాయలు, వార్షిక ఫీజు రూ.1.6లక్షలు వసూలు చేస్తున్నారు. ఇక, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లోని సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ స్కూళ్లలో చూస్తే.. ఎల్‌కేజీ స్టూడెంట్ ఫీజే రూ.4 లక్షలుగా ఉంది. ఫస్ట్‌క్లాస్ ఫీజు రూ.6లక్షలు వసూలు చేస్తున్నారు.
హిమాయత్‌నగర్‌లోని మరో స్కూల్ చూస్తే.. డొనేషన్ రూ.60వేల నుంచి మొదలవుతుంది. వార్షిక ఫీజులు చూస్తే.. రూ.1.5లక్షల నుంచి మొదలవుతున్నాయి. వార్షిక ట్యూషన్ ఫీజులకు తోడు.. అడ్మిషన్ ఫీజు, స్పెషల్ ఫీజు, స్పోర్ట్స్ ఫీజు, కంప్యూటర్ ఫీజు, ట్రాన్స్‌పోర్ట్ ఫీజు, ల్యాబ్ ఫీజుల పేరుతో అదనంగా వసూలు చేస్ఉతున్నాయి. డొనేషన్ వసూలు చేయకూడదని నిబంధనలు ఉన్నా.. ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యాలు బేఖాతరు చేస్తున్నాయ. ఇక, విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం కూడా వాళ్లకు వరంగా మారుతోంది.
ప్రైవేట్ స్కూల్స్‌లో ఫీజుల వసూలు, క్లాసుల నిర్వహణ, ఉపాధ్యాయుల అర్హతల వంటి వాటాఇపై సరైన నియంత్రణ లేకుండా పోతోంది. ఫలితంగా ప్రతియేటా 20 నుంచి 50శాతం వరకు ఫీజులు పెంచుతున్నారు. చిన్న స్కూల్స్ అయినా సరే.. కార్పొరేట్ పాఠశాలలను చూసి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇక, ఐఐటీ ఒలంపియాడ్, టెక్నో, కాన్సెప్ట్ వంటి తోకలు పెట్టుకొని నడిపిస్తున్న స్కూళ్లు తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. నిబంధనల ప్రకారం పాఠశాలలకు ఇలాంటి పేర్లు తగిలించ వద్దని ఉన్నా.. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం పిల్లల తల్లిదండ్రుల పాలిట శాపంగా మారతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12 వేల ప్రైవేట్ స్కూల్స్ ఉండగా.. 40 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఫీజుల నియంత్రణ కోసం విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు గడిచిన పలు సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. 2017లో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలోని కమిటీ ఫీజుల నియంత్రణపై నివేదిక సమర్పించినప్పటికీ, అప్పటి ప్రభుత్వం దానిని పక్కన పెట్టింది.
తాజాగా, రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టిసారించి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో చర్చలు జరిపింది. కొన్ని సంఘాల ప్రతినిధులు ఏటా 15 శాతం వరకు ఫీజు పెంపు అనుమతించాలన్నదే తమ అభిప్రాయమని తెలిపారు. దానికంటే ఎక్కువ పెంచితే ఫీజు రెగ్యులేటరీ కమిటీకి రిపోర్ట్ చేయాలనిచెప్పారు. ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ సిఫారసులను అమలు చేయాలని, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లపై ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని, చిన్న స్కూళ్లను మాత్రం ఇబ్బందులకు గురిచేయొద్దని వారు విజ్ఞప్తి చేశారు. దీనిపై త్వరలోనే ప్రభుత్వం మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకోనుందని స్కూల్ యాజమాన్యాలు వెల్లడించాయి.