ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్ణాటక ప్రభుత్వం నాలుగు కుంకీ ఏనుగులను అందజేసింది. మొత్తం ఆరు కుంకీ ఏనుగులు ఇవ్వవలసి ఉండగా, రెండు ఏనుగులను వాటి ఆరోగ్య కారణాలు, శిక్షణ పూర్తి కాకపోవడం వంటి కారణాల వల్ల మరో దఫా అందజేయనున్నట్టు కర్ణాటక ప్రభుత్వం తెలియచేసింది. బుధవారం బెంగళూరులోని కర్ణాటక విధాన సౌధ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే, కుంకీ ఏనుగులను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణశాఖా మంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో అటవీ అధికారులకు అందించారు. కుంకీ ఏనుగుల అప్పగింతకు సంబంధించిన ఒప్పంద పత్రాలను, లైసెన్స్ లు, వాటి సంరక్షణకు సంబంధించిన విధివిధానాల పత్రాలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పవన్ కళ్యాణ్ కి అందజేశారు.
శాస్త్రోక్తంగా గజ పూజ నిర్వహించిన అనంతరం జెండా ఊపుతూ కర్ణాటక ప్రభుత్వాధినేతలు కుంకీలను సాగనంపగా, పూల వర్షం కురిపిస్తూ పవన్ కళ్యణ్ ఆహ్వానం పలికారు. ఈ నాలుగు ఏనుగులను కర్ణాటక అటవీశాఖ అధికారుల నుంచి ఆంధ్రప్రదేశ్ అటవీ అధికారులు అధికారికంగా స్వీకరించారు. దేవా, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర అనే పేర్లు కలిగిన కుంకీ ఏనుగులు ఆంధ్రప్రదేశ్ కి అప్పగించారు. కర్ణాటకకు చెందిన మావటీలు రెండు నెలలపాటు కుంకీ ఏనుగులతో ఉండి ఆంధ్రప్రదేశ్ మావటీలకు వాటి సంరక్షణ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని ఏనుగులు ఇవ్వడానికీ సిద్ధమని ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కర్ణాటక ఇచ్చిన కుంకీ ఏనుగుల ఆరోగ్య సంరక్షణ బాధ్యతను ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.