హిందూవుల పవిత్ర గ్రంథం భగవద్గీతకు యునెస్కో గుర్తింపు లభించింది. అదే సమయంలో భరతముని రాసిన నాట్య శాస్త్రానికీ కూడా ఈ గుర్తింపు దక్కింది. యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్-2025లో రెండింటికీ చోటు కల్పించింది యునెస్కో. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ తెలిపారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ పరిణామమంటూ ప్రధాని మోడీ పోస్ట్ చేశారు. భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం లభించిందన్నారు. భగవద్గీత, నాట్యశాస్త్రం దేశ నాగరికతను, ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాయన్నారు ప్రధాని మోడీ
ఈ రెండింటిని కలుపుకుంటే ఇప్పటి వరకు మన దేశం నుంచి 14 శాసనలు యునెస్కో రిజిస్టర్‌లో చోటు దక్కించుకున్నాయి. భగవద్గీతను భవిష్యత్ తరాలకు అందేలా సంరక్షించేందుకు, అంతర్జాతీయ సహకారంతో పాటు నిధుల సమీకరణకు యునెస్కో గుర్తింపు ఉపయోగపడుతుంది. గ్రంథం చారిత్రక, సాంస్కృతిక విలువను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
యునెస్కో గుర్తింపు పొందిన విద్యాసంస్థలు, పరిశోధకులు, స్కాలర్లు భగవద్గీత తాత్విక, సాహిత్య, చారిత్రక అంశాలపై మరింత అధ్యయనం చేయడానికి అవకాశం కల్పిస్తుంది ఈ గుర్తింపు. పురాతన లిపుల్లో ఉన్న భగవద్గీత డిజిటలైజేషన్ కూడా… యునెస్కో గుర్తింపు వల్ల సాధ్యమవుతుంది. ఈ ప్రక్రియ పూర్తైతే భగవద్గీత ప్రపంచవ్యాప్తంగా మరింత సులభంగా అందుబాటులో ఉండనుంది.