19.2 C
Hyderabad
Monday, December 15, 2025

Live Video

spot_img

హైదరాబాద్ పరిరక్షణకే హైడ్రా – సీఎం రేవంత్‌

చారిత్రక హైదరాబాద్ నగరాన్ని పరిరక్షించడానికే హైడ్రా సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పునరుద్ఘాటించారు. ట్యాంక్‌ బండ్‌ సమీపంలో హైడ్రా తొలి పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్‌ మాట్లాడారు. హైడ్రా విద్యుక్త ధర్మంలో భాగంగా హైడ్రా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో చారిత్రక నగరం హైదరాబాద్ పరిరక్షణకు హైడ్రా ఏర్పాటు చేసిందన్నారు. 1908 లో వచ్చిన వరదలు నిజాం ప్రభుత్వాన్ని కదిలించాయని, ఆనాడు వరదల నివారణకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ద్వారా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లను నిజాం నిర్మించారని రేవంత్ గుర్తు చేశారు. మన నగరాన్ని పునరుద్ధరించుకోవాలన్న ఆలోచనతోనే హైడ్రాను తీసుకొచ్చామన్నారు.

బెంగుళూరులో చెరువులను పరిరక్షించుకోకపోవడంతో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ముంబై, చెన్నై వరదలతో సతమతమవుతున్నాయని, అటు.. కాలుష్యాన్ని నియంత్రికపోవడంతో ఢిల్లీలో పార్లమెంట్ నుంచి పాఠశాల వరకు సెలవులు ప్రకటిస్తున్న పరిస్థితి నెలకొందని రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. మెట్రో నగరాలు నివసించడానికి యోగ్యం కాని నగరాలుగా మారుతున్నాయని, ప్రకృతిని కాపాడుకోకపోతే హైదరాబాద్ లోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని.. అందుకే ఎవరేం అనుకున్నా హైడ్రాను తీసుకొచ్చామన్నారు. చెరువులు ఆక్రమిస్తే ఎంతటివారినైనా హైడ్రా ఉపేక్షించదన్నారు.

హైదరాబాద్ లో చిన్న వర్షం వస్తే కాలనీలకు కాలనీలే మునిగిపోతున్నాయని, హైడ్రా అంటే కేవలం కూల్చివేతలే కాదని, రోడ్డుపై నీరు నిలవకుండా, విద్యుత్ పునరుద్ధరణ జరిగేలా, వర్షాలు పడిన సమయంలో ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేసే బాధ్యతను హైడ్రా చూసుకుంటోందన్నారు. నగరంలో చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురయ్యాయని, కొందరు రోడ్లను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారని సీఎం ఆవేదన వ్యక్తంచేశారు. వీటిని నియంత్రించాల్సిన అవసరం లేదా?, నగరాన్ని ఇలాగే నిర్లక్ష్యంగా వదిలేద్దామా? అని ప్రశ్నించిన రేవంత్‌.. అందుకే హైడ్రాను ఏర్పాటు చేసుకున్నామన్నారు. హైడ్రా ద్వారా చెరువులను కాపాడి వాటిని పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. చెరువులను , నాలాలను, మూసీని ఆక్రమించుకున్న వారికే హైడ్రా అంటే కోపం వస్తోందని, అలాంటి కొంతమంది మా నిర్ణయాలను వ్యతిరేకించినా… ప్రజలకోసం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. పునరుద్ధరించుకుంటామంటే కొందరికి బాధైతుందని, ప్రకృతిని కాపాడుతామంటే కొందరికి దుఃఖం వస్తుందని, ఆక్రమణలు తొలగిస్తుంటే రియల్ ఎస్టేట్ పడిపోతుందని మాట్లాడుతున్నారని రేవంత్‌ వ్యాఖ్యానించారు.

కొందరు కడుపు నిండా విషం నింపుకుని ప్రభుత్వాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తున్నారని, ప్రజలకు మేలు జరగొద్దని చూస్తున్నారని. గుజరాత్ లో సబర్మతి, యూపీలో గంగా నది, ఢిల్లీలో యమునా నదిని వాళ్లు ప్రక్షాళన చేసుకుంటున్నారని, కానీ, మనం మూసీని పునరుద్ధరణ చేస్తామంటే అడ్డుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ నాయకులు చేస్తే కరెక్టు.. తెలంగాణలో కాంగ్రెస్ చేస్తే తప్పా…? అని రేవంత్‌ ప్రశ్నించారు. తనపై కక్ష ఉంటే తనపైనే చూపాలని, ప్రజలకు మేలు జరిగే పనులను అడ్డుకోవద్దని కోరారు. వారసత్వ సంపదను కాపాడుకుని నగరాన్ని పునరుద్ధరించుకుందామని సీఎం పిలుపునిచ్చారు. పేదల పట్ల మానవీయ కోణంతో, సానుభూతితో వ్యవహరించాలని, పేదలకు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, పెద్దల పట్ల మాత్రం కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్‌.. హైడ్రా అధికారులకు సూచించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com