29.2 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

దిల్ రాజుపై ఐటి దాడులు…అదేనా కారణం..?

ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసంలో ఆదాయపన్ను శాఖ దాడులు చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టిస్తున్నాయి. 2008లో దిల్ రాజు నివాసంలో ఐటి సోదాలు జరగగా…. 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు మరొకసారి సోదాలు చేశారు. ఫిబ్రవరి మూడో తేదీన తమ ఎదుట హాజరుకావాలని ఐటీ అధికారులు ఆదేశించగా… ఇప్పటికి మూడుసార్లు సోదాలు జరిగాయి.

దిల్ రాజుతో పాటు ఆయన వ్యాపార భాగస్వామి నిర్మాత శిరీష్ ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దిల్ రాజు కుమార్తె హన్సిత రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు తనిఖీ చేశారు. వీరితోపాటు మరి కొందరు సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖ నిర్మాతల ఇళ్లలో సోదాలు చేశారు. ఏకకాలంలో 8 చోట్ల 55 బృందాలతో తనిఖీలు జరిపారు.

నిన్న కార్యాలయంలో జరిగిన సోదాల్లో ఏవిధమైన ఆస్తుల పత్రాలు లభ్యమవలేదని సమాచారం. దిల్ రాజు దగ్గర ఐదు లక్షలు కూతురింట్లో ఆరు లక్షలతోపాటు కుటుంబం మొత్తంలో 20 లక్షలు నగదు దొరికాయని సమాచారం. దిల్ రాజు సినిమాలు విడుదలైన సమయంలోనే దాడులు జరగటంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ‘గేమ్ ఛేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సినిమాలని ఆయన భారీ బడ్జెట్ తో నిర్మించారు. ‘పుష్ప 2’ ప్రొడ్యూసర్స్ మైత్రీ మూవీ మేకర్స్, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆఫీస్ లోను అధికారులు సోదాలు నిర్వహించారు. వేకువ జామునే ఐటీ అధికారులు సోదాలకు రావడంతో సినీ ప్రముఖులు ఉలిక్కిపడ్డారు.

సంక్రాంతికి విడుదలైన సినిమాలకు ఎంత బడ్జెట్ పెట్టారు. వచ్చిన కలెక్షన్స్ ఎంత? అనే పూర్తి విషయాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలకు పెట్టుబడి పెట్టడానికి దిల్ రాజు అప్పు తీసుకొచ్చారని, అందుకు సంబంధించిన పలు అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారని తెలిసింది.
గేమ్ ఛేంజర్ తోపాటు సంక్రాంతికి వస్తున్నాం, డాకుమహరాజ్ సినిమాల వల్లే ఐటి సోదాలు జరిగాయని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.  ‘డాకు మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలకు మంచి కలెక్షన్లు రాగా గేమ్ చేంజర్ వసూళ్లలో వెనుకపడింది. సినిమా బడ్జెట్ లో సగం కూడా వసూళ్ళు చేయలేకపోయిందని వినికిడి.
గేమ్ ఛేంజర్ ప్లాప్ అయితే.. దాడులు ఎందుకు జరిగాయని సగటు మనిషికి అనుమానం రావొచ్చు. ఇక్కడే నిర్మాతలు చేసిన చిన్న పొరపాటుతో ఇదంతా జరిగిందంటున్నారు. మూడు సినిమాల  పోస్టర్స్ లో రిలీజ్ తరువాత వందల కోట్లు కలెక్షన్లు వస్తున్నట్టు ప్రచారం చేశారు. మొదటి రోజే 186 కోట్లు వసూళ్లు చేసిందనే ప్రచారమే ఐటీ దాడులకు దారి తీసినట్టు సమాచారం. మరోవైపు వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా పాన్ ఇండియా కాకపోయినా.. వారం తిరక్క ముందే  200 కోట్ల వసూళ్లని పోస్టర్స్ రిలీజ్ చేశారు. పుష్ప 2 సినిమాతో ఏకంగా రూ.1850 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు మైత్రి మూవీ మేకర్స్ చూపించింది. ఈ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ ఇళ్లతో పాటు పుష్ప2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు.
తమిళ స్టార్ హీరో విజయ్ తో తీసిన ఒక సినిమా దిల్ రాజుకు తలనొప్పులు తెచ్చిందని, ఆ తమిళ సినిమాకు సంబంధించిన పత్రాల ఆంశంలో ఐటీ అధికారులు సీరియస్ గా పరిశీలించినట్లు వార్తలు వస్తున్నాయి. వాటికి సంబంధించి దిల్ రాజు కూడా సరైన లెక్కలు చూపించకపోవడంతో ప్రాథమికంగా ఆయనపై కేసు నమోదైందని టాలీవుడ్ లో టాక్.

అయితే తెలుగు సినీ పరిశ్రమలో దిల్ రాజుకు మంచి పేరు ఉంది. ఆయన ఎప్పుడు పన్నులు ఎగ్గొట్టలేదని ఆయన సన్నిహితులు చెపుతారు. ఇటువంటి విషయాల్లో నిక్కచ్చిగా ఉంటారని పేరుంది. పోస్టర్ల దెబ్బకు దిగొచ్చిన దిల్ రాజు… కలెక్షన్ల పోస్టర్లపై త్వరలోనే నిర్మాతల సమావేశం నిర్వహించి…వాటిపై తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

మరో చర్చ కూడా జరుగుతోంది. ఐటీ సోదాల్లో 400 కోట్ల లెక్కలపై అధికారులు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. 400 కోట్లు ఏంటి.. ఏ లెక్కలు.. సినిమాలవా.. దిల్ రాజు పర్సనల్ లెక్కలా.. అసలు ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

దిల్ రాజు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా వచ్చిన నాటి నుంచి ఆయనకు కలిసి రావడం లేదు. సిఎం రేవంత్ రెడ్డి అన్ని సమీకరణాలు బేరీజు వేసిన తర్వాత దిల్ రాజును ఎఫ్ డిసి చైర్మన్ గా ఎంపిక చేశారు. పుష్పా సినిమా తొక్కిసలాటతో మొదలైన సమస్యలు సంక్రాంతికి వస్తున్నాం విడుదల తర్వాత ఐటి దాడుల వరకు కొనసాగాయి.

అందరివాడుగా ఉండే దిల్ రాజు ఎఫ్ డిసి చైర్మన్ పదవితో కొందరి వాడయ్యాడనే పుకార్లు ఉన్నాయి. పుష్పా 2 వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి…అల్లు అర్జున్ కు మధ్య సయోధ్య కుదర్చటంలో దిల్ రాజు సఫలమయ్యారు. రెండు రాష్ట్రాల్లో పుష్ప-2కు టికెట్ రేట్లు పెంచగా దానికి కలెక్షన్ల వర్షం కురిసింది. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచలేదు. ఇది కూడా అమరావతిలో కొన్ని వర్గాలకు కంటగింపుగా మారిందని…దాని ఫలితమే ఐటి దాడులని అనుకొంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com