- దావోస్ లో నాలుగు రోజుల సదస్సులు సాధించినదేమిటి?
- మహారాష్ట్రకు 16 లక్షల కోట్లు, తెలంగాణకు లక్ష కోట్ల పెట్టుబడులు
- ఏపీకి నినాదాలే మిగిలాయా? బ్రాండ్ ఇమేజ్ తో కంపెనీలు వస్తాయా?
- చంద్రబాబు నెట్వర్కింగ్కి కంపెనీలు ల్యాండ్ అవుతాయా?
ఏపీకి పెట్టుబడులు, కొత్త పరిశ్రమలను ఆకర్షించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ దావోస్ లో సాగించిన నాలుగు రోజుల పర్యటన ముగిసింది. అయితే ఈసారి రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయి? ఎన్నింటి విషయంలో కనీసం ఎంఓయులు అయినా చేసుకున్నారా…? అంటే సమాధానం లేదు. చంద్రబాబు రిక్త హస్తాలతో వెనక్కు వస్తున్నారనే చెప్పాలి. ఇలా ఎందుకు అనాల్సి వస్తోందంటే పొరుగు రాష్ట్రాలు రెండూ ఎంతో కొంత పెట్టుబడులు, ఎంఓయులను సాధించుకుని వెనుదిరిగాయి. కానీ ఏపీకి మాత్రం దక్కింది ఏమీ లేదు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ 16లక్షలకోట్లకు పైగా పెట్టుబడులు సాధించగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులు సూపర్ డూపర్ కోఆర్డినేషన్‌తో లక్ష 79వేల కోట్ల పెట్టుబడులు సాధించుకుని వెనుదిరిగారు. ఏపీతో పోలిస్తే తెలంగాణ మందీ మార్బలం చాలా తక్కువగా పరిమితంగా దావోస్ ట్రిప్‌కు వెళ్లారు. పైగా వెంట ఎలాంటి మీడియాను తీసుకెళ్లలేదు. ఎలాంటి ప్రచారార్భాటమూ లేదు. సీఎం రేవంత్, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మరికొందరు అధికారులు మాత్రమే దావోస్ కు వెళ్లారు. అయినా మంచి ఫలితాలను రాబట్టారు. మరో పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర కూడా మంచి ఫలితాలనే రాబట్టుకుంది. కానీ ఏపీ మాత్రం శూన్య హస్తాలతో వెనక్కు రావాల్సిన పరిస్థితి. తెలంగాణ సైలెంట్ కిల్లర్ లాగా దూసుకుపోతే ఏపీ బృందం ప్రచారం, భారీ పబ్లిసిటీ తో అట్టహాసంగా అక్కడకు వెళ్లింది. నాలుగు రోజుల పాటు సదస్సులు, సమావేశాలు ఇంటరాక్షన్లు, ఆడియో విజువల్ పబ్లిసిటీ గట్రా గట్రా కమ్యూనికేషన్ మాధ్యమంలో ఉన్న అన్ని టెక్నాలజీలను ఏపీ సీఎం టీమ్ వాడేసింది. కానీ ఫలితం మాత్రం శూన్యం. ఒక్కటంటే ఒక్క పెట్టుబడి రాలేదు. కనీసం ఎంఓయు కూడా జరగలేదు.
నో ఎంఓయూ.. ఓన్లీ బ్రాండ్ ఇమేజ్
చంద్రబాబు ఈసారి వ్యూహం మార్చారా? తన మార్కెటింగ్ స్ట్రాటజీని మార్చారా? అసలు చంద్రబాబు అంటేనే ఒక బ్రాండ్,.. ఒక ట్రెండ్ సెట్టర్. ఆయన సీఎం కాదు.. కార్పొరేట్ సీఈఓ అని టిడీపీ శ్రేణులు, ఆయన అనుకూల మీడియా చెబుతుంటాయి. చంద్రబాబు కదిలారంటేనే పెట్టుబడుల వరద ఏరులై పారుతుందని, ఏపీ దశ దిశ తిరుగుతుందని మొదట్లో ప్రచారార్భాటం చేశారు. చంద్రబాబు వెంట మూడు మీడియా సంస్థలు కూడా వెళ్లాయి. వాటికి కోట్లల్లో వర్క్ ఆర్డర్లు కూడా ఇచ్చారు. ఆ సంస్థల ఆధ్వర్యంలోనే అధునాతన అంశాలపై సుదీర్ఘ చర్చలు కూడా సాగాయి. అన్ని చోట్లా ఏపీ బ్రాండ్ క్రియేట్ చేశామని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ చెబుతున్నారు. కేవలం బ్రాండ్ ఇమేజ్ ను, నెట్ వర్క్‌ని డెవలప్ చేసుకోవడమే లక్ష్యంగా దావోస్‌లో పని చేశామంటున్నారు. గతంలో చంద్రబాబు అంటేనే ఐటీకి బ్రాండ్ ఇమేజ్.. ఉమ్మడి ఏపీలో ఐటీ రంగం అభివృద్ధికి ఆయనే పునాదులు వేశారని చెప్పుకుంటారు. అలాంటిది ఈసారి మాత్రం ఏ ఒక్క కంపెనీనీ ఏపీకి ఆకర్షించలేకపోయారు. ఐటి రంగం స్థానంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వాణిజ్య అవకాశాల గురించి ప్రచారం చేశారు. ఏపీలో గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో పెట్టుబడులకు, ఎక్కువ గ్రోత్ కు అవకాశాలున్నాయని వివరించడంలో బాబు టీమ్ విజయం సాధించారని తెలుగుదేశం మీడియా చెబుతోంది. అయితే ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా వాణిజ్యవేత్తలను మాత్రం పురికొల్పలేకపోయారు. ఒప్పందాలదేముంది? ముందు పబ్లిసిటీ బాగా జరిగితే పెట్టుబడులు వాటంతట అవే వస్తాయని టీడీపీ నేతలంటున్నారు.
నెట్వర్కింగ్ సూపరని వంత పాడుతున్న మీడియా
దావోస్ పర్యటనలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంచేశామని, ఏపీలో పెట్టుబడులకు ఉన్నఅపార అవకాశాల గురించి ప్రపంచ వాణిజ్యవేత్తలకు వివరించడంలో గ్రాండ్ సక్సెస్ అయ్యామని ప్రభుత్వం చెబుతోంది. అయితే అంత భారీ పబ్లిసిటీ, అట్టహాసంగా సదస్సులు, చర్చావేదికలు, పవర్ పాయింట్ ప్రెజంటేషన్లు చేసినా ఒక్క కంపెనీ కూడా ఎందుకు ఆసక్తి చూపలేదన్నది విచిత్రంగా ఉంది. పొరుగు రాష్ట్రాలు ఎలాంటి పబ్లిసిటీ లేకుండానే పనికానిచ్చుకుని వారికి కావాల్సింది సాధించుకుని వచ్చాయి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం ఏపీ షైనింగ్, ఏపీ రైజింగ్ లాంటి మార్కెటింగ్ స్లోగన్స్ తో భారీగా అట్టహాసంగా ప్రచారం సాగించారు. కంపెనీలు తరలి రావడానికి, పెట్టుబడులు పెట్టడానికి ముందు ఏపీలో ఉన్న అవకాశాల గురించి తెలియాలి కదా, అందుకే వారందరికీ ఏపీ లో అనుకూల వాతావరణం ఉందని చెప్పామని, విశ్వ వేదికలపై ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను సరికొత్తగా ఆవిష్కరించామని చంద్రబాబు బృందం, ఆయన అనుకూల మీడియా చెబుతోంది. దావోస్ ట్రిప్ లో ఏమీ సాధించలేకపోవడంతో చంద్రబాబు కేవలం నెట్వర్క్, పబ్లిసిటీ, ఏపీకి ఒకబ్రాండ్ను క్రియేట్చేయడమే లక్ష్యంగా వెళ్లారని, ఆ పని దిగ్విజయంగా పూర్తి చేశారని ఆ మీడియా ఇప్పుడు స్వరం మార్చింది. కానీ ప్రచారార్భాటానికి, పనితనానికి మధ్యనున్నతేడాను తెలుసుకోలేనంత అమాయకంగా ప్రజలు ఉన్నారా అన్నది మాత్రం ఆలోచించలేకపోతోంది.