టీమ్ ఇండియా సీనియర్లు రంజీ బాట పడ్డారు. ఎందుకంటే ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుని వచ్చారు. అంతేకాదు స్వదేశంలో కివీస్ తో టెస్టు సిరీస్ కూడా కోల్పోయారు. ఇదే టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కి అర్హత లేకుండా చేసింది. అక్కడ ఒక టెస్టు గెలిచినా రేసులో టీమ్ ఇండియా ఉండేది. అది కూడా లేకుండా చేసుకున్నారు.
దీంతో టీమ్ ఇండియా సీనియర్ల జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతవరకు సీనియర్లను సపోర్టు చేసిన అభిమానులు కూడా ఇంక ఇంటికెళ్లి రెస్టు తీసుకోమని ఘాటుగానే ట్వీట్లు పెట్టారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
ఈ దెబ్బతో సీనియర్లందరూ దారిలో పడ్డారు. అంతేకాదు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కూడా ఇండియన్ టీమ్స్ కి ఆడే ప్రతి క్రికెటరు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని హుకుం జారీ చేసింది. దీంతో ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఉద్ధండ క్రికెటర్ విరాట్ కొహ్లీ లు రంజీలు ఆడేందుకు సిద్ధమయ్యారు.
ముంబై జట్టులో రోహిత్ శర్మ ఆడుతుంటే, ఢిల్లీ జట్టులో కొహ్లీ ఆడాల్సి ఉంది. అయితే మెడనొప్పి కారణంగా తొలి మ్యాచ్ నుంచి తప్పుకున్నట్టు తెలిసింది. మొత్తానికి లండన్ బాబు ఇండియా దారి పట్టాడు.
ప్రస్తుతం టీమ్ ఇండియా క్రికెటర్లలో రంజీలు ఆడుతున్నవారెవరంటే యశస్వి జైశ్వాల్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, శుభ్ మన్ గిల్, శివమ్ దుబె, శార్దూల్ ఠాకూర్ ఇలా పలువరు తమ జట్ల తరఫున ఆడనున్నారు.
అయితే రంజీ ట్రోఫీ ఎలైట్ మ్యాచ్ లు మొదలయ్యాయి. జమ్ముకశ్మీర్ వర్సెస్ ముంబయి మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ముంబయి బ్యాటింగ్ ఎంచుకుంది. సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ బ్యాటింగు ఎంచుకుంది. పలు రాష్ట్రాల మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. మొత్తానికి బడా క్రికెటర్లందరూ దెబ్బకి నేలకు దిగారు. కాలం మారిందని గ్రహించారు.
ఇకనుంచైనా వళ్లు దగ్గర పెట్టుకుని ఆడతారని, తమ అభిమాన క్రికెటర్లు ఇక ముందైనా మంచి స్కోర్లు చేస్తారని ఆశిస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరేం చేస్తారో వేచి చూడాల్సిందే.