టర్కీలోని ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మొదట 10 మంది మృతి చెందగా.. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న కొద్ది మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఈ ప్రమాదంలో 76 మంది మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. మరో 51 మంది తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
టర్కీలోని బోలు ప్రావిన్స్ కొరొగ్లు పర్వత ప్రాంతాల్లోని కర్తల్‌కయ ఏరియాలో 12 అంతస్తుల రిసార్ట్ ఉంది. దీని పేరు గ్రాండ్ కర్తాల్ హోటల్. ఇక్కడే మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో హోటల్‌లో 234 మంది ఉన్నారు. మంటలు ఏ అంతస్తులో ప్రారంభమయ్యాయి.. ఎలా వ్యాపించాయి? అసలు మంటలు ఎందుకు చెలరేగాయి? అనే దానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ ఈ ప్రమాదంలో చాలా మంది అగ్నికి ఆహుతయ్యారు. కొందరు మంటల భయంతో కిటికీల నుంచి దూకేయడంతో మృతి చెందినట్టు అధికారులు తెలిపారు.
ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. మంటలను అదుపులోకి తెచ్చే సరికి తెల్లవారింది. ఆ తర్వాత లోపలికి వెళ్లినవారికి చాలా మంది బూడిదై కనిపించారు. అయితే హోటల్ మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ హోటల్ చాలా వరకు కలపతో చేసింది కాగా.. హోటల్‌లో స్మోక్ డిటెక్టర్స్ లేనట్టు తెలుస్తోంది.
ఈ ప్రమాదంపై టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ స్పందించారు. ప్రమాదం గురించి తెలుసుకొని తన హృదయం బద్ధలైందన్నారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయని.. ప్రమాదానికి కారణం తెలుసుకుంటామన్నారు ఆయన. మరోవైపు ఇప్పటి వరకు 45 మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు అధికారులు.
ప్రస్తుతం టర్కీలో హాలీడేస్ ఉన్నాయి. రెండు వారాల పాటు స్కూళ్లకు సెలవులు నడుస్తున్నాయి. దీనికి తోడు ఈ హోటల్ ఉన్న పర్వత ప్రాంతం స్కీయింగ్‌కు చాలా ఫేమస్. దీంతో చాలా మంది పర్యాటకులు అక్కడికి వచ్చారు. దీంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగిందనే చెప్పాలి.