బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలపైకి, నాయకుల ఇళ్ళపైకి వస్తామంటే భయపడే ప్రశక్తి లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. 60 లక్షల మంది సైనికులు ఉన్న బీఆర్‌ఎస్ కుటుంబం తలచుకుంటే కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో తిరగే పరిస్ధితి ఉండదని కవిత హెచ్చరించారు. రౌడీ మూకలను వేసుకుని పార్టీ కార్యాలయాలపై దాడి చేసే దరిద్రపు సంస్కృతి మాది కాదని, విజ్ఞతతో మాటలతో ప్రజల కోసం పోరాటాలు చేసే సంస్కృతి బీఆర్‌ఎస్‌దని ఆమె తెలిపారు. పారిశ్రామిక వ్యర్ధాలు మూసీలో కలుస్తుంటే 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ ఏం చేసిందని కవిత ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనలో భాగంగానే ఎస్టీపీలను ఏర్పాటు చేసి గోదవరి నదితో అనుసంధానం చేయాలని కేసీఆర్ భావించారని గుర్తు చేశారు. మూసీ ప్రక్షాళన కోసం 31 ఎస్టీపీలను కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అయితే కాంగ్రెస్ నాయకులు మూసీ ప్రాజెక్టుకు ఏటీఎంగా వాడుకోవాలని చూస్తున్నారని ఆమె విమర్శించారు. కొండపోచమ్మ మూసి అనుసంధానం చేసే ఆస్కారం ఉన్నప్పుడు మల్లన్నసాగర్‌తో అనుసంధానం చెయ్యడం కేవలం కాంట్రాక్టర్లకు మేలు చెయ్యడమే అని కవిత ఆరోపించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి కేసిఆర్ ఎంతగానో కృషి చేశారని జిల్లాలో ఫ్లోరైడ్ భూతాన్ని పారద్రోల్లడానికి కేసీఆర్ సంకల్పించారరి కవిత చెప్పారు. అందులో భాగంగానే మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి తాగునీరు సరఫరా చేసి ఫ్లోరైడ్ ని నిర్మూలించిన ఘనత కేసిఆర్‌దైతే అనేక సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు ఒక వాటర్ ప్లాంట్ పెట్టిన పాపాన పోలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.