విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సంక్రాంతి వేళ విద్యుత్ ఉద్యోగుల ఇళ్లలో సంబురాలు నింపింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధనశాఖా మంత్రి భట్టి విక్రమార్క్ ఆ శాఖ ఉద్యోగుల ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పెడుతూ తీపికబురు అందించారు. చేస్తామని, చేశామని చెప్పడమే కాదు.. ఆ ఉత్తర్వులను కూడా సభాముఖంగా ప్రదర్శించి అందరినీ ఆనందంలో ముంచెత్తారు. అంతకుముందే విద్యుత్ ఉద్యోగుల పెండింగ్ డీఏను విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉత్తర్వులను జారీచేశారు. శనివారం సాయంత్రం సచివాలయం ముందు రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద ఎన్‌పీడీసీఎల్, ట్రాన్స్‌కోలో కొత్తగా నియమితులైన ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు. తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థలో జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ గా నియమితులైన 92 మంది అభ్యర్థులకు, తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థలో కొత్తగా నియామకమైన 20 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అందజేశారు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ విద్యుత్ రంగంలో తెలంగాణ దూసుకుపోతోందని చెప్పారు. అదే సందర్భంలో విద్యుత్ ఉద్యోగులకు పెండింగ్ డీఏలు విడుదల చేస్తూ జారీచేసిన ఉత్తర్వుల ప్రతిని చేతులతో పైకెత్తి అందరికీ ప్రదర్శించారు. దీంతో, విద్యుత్ ఉద్యోగుల్లో ఆనందం వెల్లి విరిసింది.