పొగమంచు ఢిల్లీని వెంటాడుతోంది. పూర్తిగా ఢిల్లీని మంచు దుప్పటి కప్పేసింది. దీంతో, ఎదురుగా ఉన్నవాళ్లు, వాహనాలు కూడా కనిపించడం లేదు. ఈ కారణంగా శుక్రవారం 130 విమానాలు ఆలస్యంగా నడిచాయి. కనీసం 27 రైళ్లు ఆలస్యమయ్యాయి. విజిబిలిటీ 200 మీటర్లకు పడిపోయిందని అధికారులు వెల్లడించారు. శని, ఆదివారాల్లో కూడా పొగమంచు అలాగే కొనసాగితే విమానాలు, రైళ్ల ఆలస్యం కొనసాగుతుందని తెలిపారు. ప్రయాణీకులు మరింత సమాచారం కోసం ఎంక్వైరీల్లో సంప్రదించాలని సూచిస్తున్నారు.
అంతేకాదు.. విమానాల్లో ప్రయాణించేవాళ్లు.. ఎయిర్‌పోర్టుకు బయలుదేరే ముందు అప్‌డేట్స్ తెలుసుకొని ఇంటినుంచి బయలుదేరాలని విమానయాన సంస్థ అధికారులు సూచిస్తున్నారు. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ అండ్ రీసెర్చ్ ప్రకారం.. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ శుక్రవారం ఉదయం 294 వద్ద ఉందని అధికారులు వెల్లడించారు.
జీఆర్ఏపీ 4 రద్దు..
గత సంవత్సరం దీపావళి తర్వాత ఢిల్లీ ఏక్యూఐ సివియర్ ప్లస్ కేటగిరీకి చేరింది. దీంతో అధికారులు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ -జీఆర్ఏపీ 4 ను విధించారు. అప్పటి నుంచి ఢిల్లీలో జీఆర్ఏపీ 3, 4 దశలను విధించడం, రద్దు చేయడం జరుగుతోంది. గురువారం దట్టమైన పొగమంచు ఆవరించి, విజిబిలిటీ సున్నాకు తగ్గడంతో ప్రభుత్వం జీఆర్ఏపీ 4వ దశను తిరిగి విధించింది. అయితే, తేలికపాటి వర్షం ఈ ప్రాంతంలో గాలి నాణ్యతను కొద్దిగా మెరుగుపరిచింది. దాంతో మరుసటిరోజు దానిని ఉపసంహరించుకున్నారు.