- నారా,నందమూరి కుటుంబాల హాజరు
- గ్రామ దేవతలకు మొక్కులు, పెద్దలకు నివాళులు
- రాష్ట్రం సుభిక్షంగా ఉందన్న చంద్రబాబు
- ప్రతీ పల్లె, ప్రతీ ఇంట్లో ప్రశాంతత కనిపిస్తోందన్న బాబు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగను తన స్వ గ్రామం నారావారి పల్లెలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. వేడుకల్లో భాగంగా గ్రామదేవత గంగమ్మకు చంద్రబాబుకుటుంబం పూజలు చేసింది. నాగాలమ్మ పుట్ట దగ్గర మొక్కులు కూడా చెల్లించుకున్నారు. పుట్టకు నూలు పొగులు చుట్టి నైవేద్యంగా పాలను సమర్పించుకున్నారు. నారాలోకేష్, బ్రహ్మణి, దేవాంశ్, భువనేశ్వరి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. నారావారి పల్లెలలోనే ఉన్న తల్లి దండ్రుల సమాధుల దగ్గర, అత్తమామలైన బసవతారకం, ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు కుటుంబంతో పాటు వియ్యంకుడు బాలకృష్ణ కుటుంబం కూడా పాల్గొంది. బాలయ్య భార్య వసుంధర, అల్లుడు శ్రీభరత్, బాలయ్య కుమార్తె తేజస్విని, అనేక మంది నారా, నందమూరి కుటుంబీకులు, స్థానిక గ్రామస్థులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
పండుగ సందర్భంగా పిల్లలు, మహిళలకు పలు వేడుకలను నిర్వహించారు. ఈ పోటీల్లో చంద్రబాబు మనుమడు దేవాంశ్ కూడా పాల్గొన్నాడు. సాక్ రేస్ లో ఉత్సాహంగా దేవాంశ్ పోటీ పడ్డాడు. అనంతరం విజేతలకు బహుమతులు అందచేశారు. ప్రతీ ఏటా సంక్రాంతి పండుగను నారా, నందమూరి కుటుంబాలు కలిసే జరుపుకుంటాయి. ఈసందర్భంగా చంద్రబాబు గ్రామస్థులను కలసి వారితో ముచ్చటిస్తుంటారు. ఈసారి కూడా స్థానికులను కలసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఏపీ సర్వతోముఖాభివృధ్ధే నా లక్ష్యం… బాబు
ఈ సందర్భంగా చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. ఏపీ సర్వతోముఖాభివృద్ధి దిశలో అడుగులేస్తోందన్నారు. ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా ఏపీని నిలబెట్టాలన్నది తమ లక్ష్యమని అన్నారు. ప్రధాని మోడీ సహకారంతో రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన అనేక అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టామన్నారు. ఆరువేల ఏడు వందల కోట్ల బకాయిలను విడుదల చేశామని, పోలవరం నిర్వాసితులకు పరిహారం కూడా అందించామన్నారు. ధాన్యం అమ్మిన రైతులకు ఒక్క రోజు వ్యవధిలోనే నగదు జమ అయ్యేలా ఏర్పాట్లు చేశామని, రైతులందరూ చాలా ఆనందంగా ఉన్నారని అన్నారు. అర్హులైన వారందరికీ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.
ఈసందర్భంగా స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి చంద్రబాబును కలిశారు. ఈ సారి సంక్రాంతి పండగకి ప్రతీ పల్లెలోనూ, ప్రతీ ఇంటిలోనూ ఆనందం వెల్లివిరిసిందని, కూటమి పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు.