తెలుగువారి సంక్రాంతి సంబురాలు రాజధాని ఢిల్లీలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఉన్న సమయంలో సంక్రాంతి వేడుకలకు రాష్ట్రపతి, ప్రధానమంత్రితో సహా ప్రముఖులు హాజరయ్యేవారు.
అదే కోవలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్నారు. ప్రధానితో పాటు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు హాజరయ్యారు.
ప్రధాని నరేంద్ర మోడీకి కిషన్ రెడ్డి, చిరంజీవి, కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ స్వాగతం పలికారు. వేడుకల్లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివిసింధు కుటుంబసభ్యులతో సహా పాల్గొన్నారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ స్పెషలిస్టు డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
కేంద్ర మంత్రులు బండి సంజయ్, గజేంద్ర షెకావత్, తదితర మంత్రులు, తెలుగు రాష్ట్రాల ఎంపీలు, ప్రముఖులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బోగి మంటలను అంటించారు. గోమాతకు పూజ చేసి పళ్లు తినిపించారు. అలాగే దీపారాధన చేశారు.కిషన్ రెడ్డి ప్రధాని మోడీకి ఒక జ్ఞాపికను అందించారు.
మెగాస్టార్ చిరంజీవి, ప్రధాని నరేంద్ర మోడీ పక్క పక్కనే కూర్చోవడం విశేషం. కార్యక్రమం ఆసాంతం ప్రధాని మోడీ… చిరంజీవిని తన వెంట తీసుకెళ్లారు.
సంక్రాంతి సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బసవన్న ఆశీర్వాదాలు, కథలు, డ్యాన్స్ తదితర కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో ఎన్ టివి అధినేత నరేంద్ర చౌదరీ, ఎంపిలు డికె అరుణ, రఘునందన్ రావు, విశ్వేశ్వర్ రెడ్డి, కె.లక్ష్మణ్, బీజేపీ ఎంపీలు అనురాగ్ సింగ్ ఠాకూర్, అరుణ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
దేశమంతటా సంక్రాంతిని, పొంగల్‌ను ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటారు. ఇది మన సంస్కృతి, వ్యవసాయ సంప్రదాయాల్లో అంతర్భాగమైన వేడుకని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
ప్రజలకు ఆరోగ్యం, ఆనందమయ జీవనం లభించాలని, రైతులకు సమృద్ధిగా పంటలు పండాలని ఆయన ఎక్స్ వేదికగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.