టెన్నిస్ స్టార్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తనపై ఏకంగా విషప్రయోగం జరిగిందంటూ అందరికి షాక్ ఇచ్చాడు జకోవిచ్. ఈ ఘటన 2022లో జరిగిందన్నాడు. మెల్‌బోర్న్‌లోని ఓ హోటల్‌లో తనకు విషపూరితమైన ఆహారం ఇచ్చినట్టు ఆరోపించాడు. సీసం, పాదరసం కలిపిన ఆహారాన్ని అందించారన్నాడు. ఈ విషయాలను ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు జకోవిచ్.
నిజానికి ఆ ఏడాది. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోని కారణంగా.. ఆస్ట్రేలియా నుంచి అతన్ని డిపోర్ట్ చేశారు. వీసాను రద్దు చేసి అతన్ని ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడకుండా వెనక్కి పంపించేశారు. అప్పుడే తాను ఓ హోటల్‌లో భోజనం చేశానని.. తనపై విష ప్రయోగం జరిగిందంటున్నాడు. తాను సెర్బియాకు తిరిగి వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డానని.. అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయన్నాడు. అయితే ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఎవరితో షేర్ చేసుకోలేదన్నాడు జకోవిచ్.
అయితే జకోవిచ్ చేసిన ఆరోపణలపై భిన్న స్పందనలు వస్తున్నాయి. ఏ విషయం తెలుసుకోకుండా ఇలా ఆరోపణలు చేయడం సరికాదంటున్నారు కొందరు. అక్కడి వంటకాలను సరిగా ప్రాసెస్ చేయకపోవడం వల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏదేమైనా ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అదే ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడుతున్న జకోవిచ్ .. ఈ వ్యాఖ్యలు చేయడం మాత్రం ఇప్పుడు హైలెట్ అనే చెప్పాలి.
అయితే డిపోర్టేషన్ అంశం తన కెరీర్‌పై ఎఫెక్ట్ చూపించినా.. తనకు ఆస్ట్రేలియన్లపై ఎలాంటి ద్వేషభావం లేదన్నాడు జకోవిచ్. తాను కోవిడ్ వ్యాక్సిన్‌ను అనుకూలం కాదు.. అలాని వ్యాక్సిన్‌కు వ్యతిరేకం కూడా కాదన్నాడు.