25.7 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

సంక్రాంతికి కిక్కిరిసిన జనం… రోడ్లన్నీ వాహనాల మయం

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ నెలకొంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద పండుగ అయిన సంక్రాంతి పర్వదినం కోసం నగరవాసులంతా పల్లెబాట పట్టారు. ప్రధానంగా హైదరాబాద్‌ నుంచి జనం ఆంధ్రప్రదేశ్‌ వైపు తరలి వెళ్తున్నారు. బస్సులు, రైళ్లు, ప్రైవేటు వాహనాలు, సొంత కార్లు ఇలా.. ఎవరికి ఎలా వీలైతే అలా సంక్రాంతి పండుగ సెలవులు ఆస్వాదించేందుకు వెళ్తున్నారు. ఇక, తెలంగాణ ప్రభుత్వం కూడా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఇవాళే విద్యాసంస్థలకు చివరి వర్కింగ్‌డే. రేపటినుంచి తెలంగాణలోని స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు అన్నీ సంక్రాంతి సెలవులు మొదలవుతున్నాయి. ఇక, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు మెజారిటీ కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సదుపాయం కల్పించాయి. దీంతో, ఇవాళ్టినుంచే జనం సొంతూళ్లకు వెళ్లడం మొదలుపెట్టారు. కొందరేమో సొంత గ్రామాలకు వెళ్తే, మరికొందరు తమ బంధువులు, స్నేహితుల ఆహ్వానం మేరకు కుటుంబాలతో సహా హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ వైపు పయనమయ్యారు. వారం రోజుల క్రితం నుంచే రైళ్లలో రిజర్వేషన్లన్నీ నిండిపోయాయి. టికెట్లు వెయిటింగ్‌ లిస్టులు కూడా దాటిపోయి రిగ్రెట్‌కు చేరుకున్నాయి. ఇక, బస్సులదీ అదే పరిస్థితి.

సంక్రాంతి పర్వదినం ప్రాముఖ్యత, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇటు తెలంగాణ ఆర్టీసీ, అటు ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ కూడా స్పెషల్‌ బస్సులు నడుపుతున్నాయి. వందల సంఖ్యలో స్పెషల్‌ బస్సు సర్వీసులకు ఇప్పటికే షెడ్యూల్‌ రూపొందించాయి. అయితే, ఆ బస్సుల్లో కూడా సీట్లన్నీ ఫుల్‌ అయిపోయాయి. ఆన్‌లైన్‌లో బస్సులు చూసినా, రైళ్లుచూసినా వేటికీ టికెట్లు దొరకడం లేదు.

ప్రతి పండుగ సీజన్‌లో ఈ పరిస్థితి సర్వ సాధారణమే. రైళ్లలో, బస్సుల్లో రద్దీ భారీగా ఉంటుంది. ఈ డిమాండ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు ప్రైవేటు బస్సు సర్వీసులు రంగంలోకి దిగాయి. టికెట్ల రేట్లను అమాంతం పెంచేశాయి. సాధారణంగా హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ సర్వీసుల టికెట్లు 400 రూపాయల నుంచి మొదలవుతుండగా.. ప్రైవేటు బస్సు సర్వీసుల టికెట్ల రేట్లు సగటున 2వేలు పలుకుతున్నాయి. డిమాండ్‌ను బట్టి 3వేల దాకా టికెట్ల రేట్లు నిర్ణయించారు. దీంతో సామాన్యులు తాము కుటుంబసభ్యులతో కలిసి పండుగకు సొంతూరుకు వెళ్లేదెలా? అని తలలు పట్టుకుంటున్నారు.

మరోవైపు.. గ్రూప్‌ బుకింగ్స్‌కు కూడా డిమాండ్‌ భారీగా పెరిగింది. తమ వెసులుబాటు మేరకు ఎలాగూ రైళ్లు, బస్సు సర్వీసుల్లో టికెట్లు దొరికే పరిస్థితి ఉండదనుకునే వాళ్లు రెండు, మూడు ఫ్యామిలీలు కలిసి టెంపో వాహనాలు, ఎస్‌యూవీ వాహనాలు బుక్‌ చేసుకొని సొంతూళ్లకు వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఇలా వెళ్తే పెంచిన బస్సు చార్జీల ధరల్లోనే ప్రైవేటు వాహనల్లో సొంతూళ్లకు వెళ్లే అవకాశం లభిస్తోందంటున్నారు. ఇలా.. కొన్నేళ్లుగా హైదరాబాద్ నుంచి గ్రూప్‌ బుకింగ్‌ కల్చర్‌ పెరిగింది. ఇలా వెళ్తే చార్జీలు కూడా ఆదా అవుతున్నాయంటున్నారు.

పైన చెప్పుకున్న ఆర్టీసీ, బస్సు సర్వీసులు, ప్రైవేట్‌ రవాణా వాహనాలు, క్యాబ్స్‌ పక్కన బెడితే కొన్నేళ్లుగా సొంత వాహనాలున్నవాళ్ల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఎలాగూ సొంత వాహనాలు ఉన్నవాళ్లు తమ వాహనాల్లోనే పండుగకు ఊరికి వెళ్లేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫలితంగా రోడ్లమీద రద్దీ కూడా భారీగా పెరిగిపోతోంది. ఇవాళ సాయంత్రం నుంచే విజయవాడ హైదరాబాద్‌ రహదారిపై ఇలా.. సంక్రాంతి పండుగకు బయలుదేరిన వాహనాలు పెరిగిపోయాయి. ఫలితంగా హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో ఉన్న టోల్‌ప్లాజాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి.

ఇక, శనివారం, ఆదివారానికి టోల్‌ప్లాజాలు మరింత బిజీగా మారనున్నాయంటున్నారు. ఈ రద్దీ కారణంగా హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లేందుకు పట్టే సమయం కూడా గంటలకు గంటలు పెరిగిపోతుందంటున్నారు. ఈ పరిస్థితులను గ్రహించి.. రోడ్డుమార్గంలో ఏపీకి వెళ్లేవాళ్లందరూ తగిన ముందుజాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పిల్లలతో కలిసి ప్రయాణించేవాళ్లు.. సరిపడా నీళ్లు, చిరుతిళ్లు, టిఫిన్లు వెంట ఉంచుకోవాలని, లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్, కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సంక్రాంతి రద్దీ నెలకొంది… సంక్రాంతి సెలవులు రావడంతో నగరవాసులు సొంత ఊర్లకు ప్రయాణమయ్యారు.. రైల్వే స్టేషన్ ప్రాంగణం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది…. పలు రాష్ట్రాలకు వెళ్లే రైళ్లు సీట్లు లేక ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది. జనరల్ బోగీలో నిలబడి కిక్కిరిసి ప్రయాణం చేస్తున్నారు… అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో రైళ్లలో రద్దీ నెలకొంది.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com