– కోచ్ గంభీర్ పరిస్థితేమిటి?
– ఒక్కరూ ఆడకపోతే ఏం చేయాలి?
టీమ్ ఇండియా కోచ్ గౌతం గంభీర్ ప్రస్తుతం గందరగోళంలో ఉన్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ఎంతో దయనీయమైన స్థితిలో ఉన్నాడు. ఎవరూ అతన్ని కాపాడేవాళ్లే లేరన్నట్టుగా ఉన్నాడు. ఎందుకంటే ఒకరు ఆడకపోతే, ఒకరైనా ఆడాలి. 11 మంది జట్టులో ఒక్కరు సెంచరీ చేసినా చాలు, ఆ జట్టు పోరాడే స్కోరు ఇస్తుంది. అలాంటిది పై నుంచి కింది వరకు అందరూ సున్నాలు చుట్టేస్తుంటే, ఏ కోచ్ మాత్రం ఏం చేయగలడు? ఇప్పుడలాంటి క్లిష్టమైన పరిస్థితి గౌతంగంభీర్ ఎదుర్కొంటున్నాడు.
ఎన్నో అంచనాల మధ్య, ఒక సక్సెస్ ఫుల్ టీమ్ ని రాహుల్ ద్రవిడ్ నుంచి తీసుకొచ్చి గంభీర్ చేతిలో పెట్టారు. ఈయనేం చేశాడంటే రావడం, రావడమే చాలా అగ్రెసివ్ గా వచ్చాడు. తన టీమ్ ని సెపరేట్ గా తెచ్చుకున్నాడు. భయంకరమైన కండీషన్స్ అన్నీ బీసీసీఐకి పెట్టాడు. గెంటేసిన శ్రేయాస్ అయ్యర్ ని తెచ్చి పెట్టుకున్నాడు. ఏమీ చేయలేక, విధిలేక వాళ్లు కూడా ఒప్పుకున్నారు.
అయితే మనోడు కోచ్ గా రావడాన్ని ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ అంగీకరించలేదు. కొహ్లీ అనుకున్నారుగానీ, ప్రాబ్లం ఇక్కడే ఉందని తర్వాత తెలిసింది. ఇక్కడ చిత్రం ఏమిటంటే, అంత బద్ధ శత్రువుల్లా ఉన్న కొహ్లీ, గంభీర్ చక్కగా కలిసిపోయారు. ఏ గొడవా లేని రోహిత్ శర్మ విడిపోయాడు.
అదెలా జరిగిందంటే, అంతవరకు జట్టులో తనెంతంటే అంతే అన్నట్టు వ్యవహారం సాగిపోయింది. రాహుల్ ద్రవిడ్ కేవలం ఆటగాళ్ల టెక్నిక్ లోపాలను సరిదిద్దడం, వాళ్లతో ఫుల్ గా ప్రాక్టీస్ చేయించడం, గేమ్ ప్లాన్ రచించడం, ప్రత్యర్థి ఆటగాళ్ల బలాలు, బలహీనతలను స్టడీ చేసి టీమ్ కి ట్రైనింగ్ ఇవ్వడం ఇవన్నీ చేసేవాడు. ఇంక జట్టు బాధ్యతలు ఎక్కువగా రోహిత్ కే వదిలేసేవాడు.
ఇక్కడ గంభీర్ తో వ్యవహారం అలా లేదు. అన్నింట్లో వేలు పెడుతున్నాడు. సూచనలు లేవు, సలహాలు లేవు, మీ ఆట మీరు ఆడండి అనడం మొదలెట్టాడు. అన్నింటికన్నా మించి శ్రీలంక పర్యటనలో టాప్ ఆర్డర్ డౌన్స్ మార్చాడు. ఫామ్ లో లేని శ్రేయాస్ అయ్యర్ ని తెచ్చాడు. బౌలింగులో కొత్తవాళ్లతో ప్రయోగాలు చేయించాడు. ఇలా అనవసర ప్రయోగాలన్నీ చేసి, రోహిత్ శర్మకు కోపం తెప్పించాడు.
ఇదిలా ఉండగా శ్రీలంకతో వన్డే సిరీస్ ఓడిపోయింది, స్వదేశంలో న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్, ఆస్ట్రేలియాలో బీజీటీ సిరీస్ పోయింది. ఈ పరిస్థితుల్లో జనవరి 22నుంచి ఇంగ్లండ్ తో స్వదేశంలో ఐదు టీ 20లు, మూడు వన్డేల సిరీస్ టీమ్ ఇండియా ఆడనుంది. మరో రెండురోజుల్లో బీసీసీఐ సెలక్షన్ కమిటీ హాజరు కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు, ఇంగ్లండ్ సిరీస్ టీమ్ లను ప్రకటించనుంది. రోహిత్ శర్మకు సెలవిచ్చేలాగే కనిపిస్తున్నారు.
ఇక్కడే అందరి ద్రష్టి కోచ్ గంభీర్ పై పడింది. ఇక్కడ తనక్కావల్సిన టీమ్ కావాలంటాడా? సెలక్షన్ కమిటీ ఇచ్చిన టీమ్ తోనే ఆడతాడా? అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. వారిచ్చిన టీమ్ తో ఆడటం వల్లే, ఇలా జరిగిందని గంభీర్ మండిపడుతున్నాడని సమాచారం. అంతేకాదు సీనియర్స్ ని పక్కన పెట్టకపోతే వారితో పాటు, కుర్రాళ్లు కూడా తన మాట వినడం లేదని బోర్డు పెద్దలకి చెప్పినట్టు సమాచారం.
టీమ్ ఇండియా ప్లేయర్లందరూ ప్రొఫెషనల్ క్రికెటర్లు, వారిపై కర్ర పెత్తనం నడవదని నెటిజన్లు అంటున్నారు. ఒకవైపు గంభీర్ తన ఆటిట్యూడ్ మార్చుకోలేకపోతే, అతి త్వరలోనే మరో కొత్త కోచ్ రావడం గ్యారంటీ అని కూడా నెటిజన్లు జోస్యం చెబుతున్నారు.