– సస్పెన్షన్, ట్రాన్స్ఫర్, న్యాయ విచారణ
– ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు
– మరో ఇద్దరు అధికారులు బదిలీ
– ఘటనపై న్యాయ విచారణ
– తిరుపతి తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు
తిరుమల తిరుపతి తొక్కిసలాట దుర్ఘటనపై రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ పరిణామానికి కారకులయ్యారంటూ ఇద్దరిని సస్పెండ్ చేశారు. మరో ఇద్దరిపై బదిలీ వేటు వేశారు. అంతేకాదు.. ఈ తొక్కిసలాట సంఘటన ఎలా జరిగిందో తేల్చేందుకు జ్యుడీషియల్ ఎంక్వైరీ వేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
తిరుపతి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. అక్కడినుంచి ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు. బాధితులతో, బాధితుల కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత టీటీడీ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
తొక్కిసలాట సంఘటన పూర్తిగా నిర్లక్ష్యం వల్లే జరిగిందన్న చంద్రబాబు.. కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పారు.ఈ ఘటనకు బాధ్యులుగా డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, ఎస్పీ సుబ్బారాయుడు, జేఈవో గౌతమి, సీఎస్ఓ శ్రీధర్ని బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన మృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. టీటీడీపై జరిగిన సమీక్షలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. తాను చెప్పిన వాటిని టీటీడీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని వెల్లడించారు.
తిరుమలలో పనిచేస్తున్న ఉద్యోగులు సేవా భావంతో పనిచేయాలని, ఎవరూ పెత్తందారీలుగా వ్యవహారించకూడదని చంద్రబాబు ఆదేశించారు. తిరుమల పవిత్రతను కాపాడతానని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నానన్నారు. ఓ పనిచేస్తుంటే జవాబుదారీతనం ఉండాలని, వైకుంఠ ద్వార దర్శనాన్ని పదిరోజులకు పెంచడం సరికాదన్నారు. ఎవరి అభిప్రాయాలతో ఇలా చేశారో తెలియదన్న చంద్రబాబు.. అధికారులకు పూర్తి స్వేచ్చనిచ్చాననని, ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోబోనన్నారు. తాను ఎవరికి బాధ్యతలు అప్పగించానో వారు బాధ్యతతో పనిచేయాలని సూచించారు. టోకెన్ల జారీ కోసం ఎంపిక చేసిన ప్రదేశం సరైనది కాదన్నారు. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే అవుతుందని, సంప్రదాయాలను గౌరవించాల్సిన అవసరం ఉంటుందన్నారు. తిరుపతిలో రాజకీయాలు చేసేందుకు అవకాశం లేదని, దైవసేవలో రాజకీయాలు ఉండకూడదని హెచ్చరించారు. మృతుల్లో విశాఖకు చెందిన ముగ్గురు భక్తులు ఉన్నారని చెప్పారు. విశాఖకు చెందిన లావణ్య, శాంతి, రజని తొక్కిసలాట ఘటనలో మృతిచెందారన్నారు. మృతుల కుటుంబాలకు టీటీడీ నిధుల నుంచి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిస్తామన్నారు. తీవ్ర గాయాలైన ఒక్కొక్కరికి రూ.5లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిస్తామన్నారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామని, మొత్తం ఆరుగురికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. 33 మంది క్షతగాత్రులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తామని చెప్పారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నామని, తిరుమల ట్రస్టు బోర్డు, అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు.