ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం ఓ ప్రత్యేక రైలును ప్రారంభించారు. దీని పేరు ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్. నిజానికి ఇది భారతీయుల కోసమే అయినా.. మన స్థానిక భారతీయుల కోసమైతే కాదు. ఈ రైలు పూర్తిగా NRIల కోసమే పరుగులు పెడుతోంది. ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా భువనేశ్వర్‌లో వర్చువల్‌గా ప్రారంభించారు ప్రధాని మోడీ. భువనేశ్వర్‌లో ఆయన జెండా ఊపితే.. ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి బయలుదేరింది.
ఈ రైలు ప్రత్యేకతలేంటి?
ఈ రైలు పూర్తిగా NRIల కోసమే కేటాయించారు. ఢిల్లీలో బయలుదేరి దేశంలోని పలు సాంప్రదాయ, మతపరమైన ప్రదేశాలను చుట్టేసి తిరిగి మూడు వారాల్లో మళ్లీ ఢిల్లీకి వస్తుంది ఈ రైలు. ఢిల్లీ తర్వాత దీని మొదటి స్టాప్ అయోధ్య. ఆ తర్వాత పాట్నా, గయా, వారణాసి, మహాబలిపురం, రామేశ్వరం, మధురై, కొచ్చి, గోవా, ఎక్తా నగర్, అజ్మీర్, పుష్కర్, చివరగా ఆగ్రాను చుట్టేసి వస్తుంది. ఈ రైలులో మొత్తం 156 మందికి మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఈ రైలును రైల్వేశాఖతో పాటు విదేశాంగశాఖ కలిసి నిర్వహిస్తాయి.
ఎవరు ప్రయాణించవచ్చు?
ముందుగా చెప్పుకున్నట్టు ప్రవాస భారతీయులకు మాత్రమే ఈ రైలులో ఎంట్రీ. అయితే అందరూ ప్రవాస భారతీయులు ప్రయాణీస్తామంటే కుదరదు. విదేశాల్లో ఉన్న లో ఇన్‌కమ్ గ్రూప్‌కు చెందిన 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారికి మాత్రమే ఈ రైలులో టికెట్ దొరకుతుంది. ముందుగా వారు ఏ దేశంలో ఉంటే ఆ దేశంలోని ఇండియన్ ఎంబసీలో అప్లై చేసుకోవాలి.
రైల్వేశాఖ, విదేశాంగశాఖ ఇచ్చే రాయితీలేంటి?
ఈ రైల్ టూర్‌కు సంబంధించిన మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాదు వివిధ దేశాల నుంచి వచ్చే టూరిస్టులు తిరిగి వెళ్లేందుకు 90 శాతం ఖర్చును కూడా కేంద్రమే భరిస్తుంది. అంటే వాళ్లు తిరిగి వెళ్లే ఫ్లైట్ ఖర్చుల్లో కేవలం 10 శాతం భరిస్తే చాలు. మిగతాదంతా కేంద్రమే చెల్లిస్తుంది. అంతేకాదు ట్రావేల్ టైమ్‌లో రైలులో కాకుండా మరేక్కడైనా బస చేయాల్సి వస్తే.. 4 స్టార్ హోటల్‌లో వసతి కల్పిస్తారు. అది కూడా పూర్తిగా ఉచితమే. ప్రవాసీ తీర్థ్ దర్శన్ పథకం కింద ఈ ట్రైన్‌ను ప్రారంభించారు.