- గవర్నర్ గెవిన్ న్యూ సోమ్ తప్పుకోవాలన్న ట్రంప్
- సమర్ధించిన ఎలాన్ మస్క్
అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ పదవీ ప్రమాణ స్వీకారానికి ముందే తన మార్క్ చూపిస్తున్నారు. కాలిఫోర్నియా కార్చిచ్చు పూర్తిగా అధికారుల వైఫల్యమేనన్నారు. అందుకు నైతిక బాధ్యత వహించి కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ గెవిన్ న్యూ సోమ్ ను తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని మండిపడ్డారు. కాలిఫోర్నియాలో కార్చిచ్చు వ్యాప్తిని నియంత్రించడం, నిరోధించడంలో ఘోర వైఫల్యం చెందారని తీవ్ర విమర్శలు చేశారు. మంటలనార్పేందుకు తగిన నీటి వాడకంలో కక్కుర్తి ప్రదర్శించారని, ఆయనకు మనుషుల విలువైన ప్రాణాలకన్నా చేపల పరిరక్షణే ఎక్కువైందని ఎద్దేవా చేశారు. కాలిఫోర్నియా అడవుల్లో కార్చిచ్చు రాజుకుని అంతకంతకూ విస్తరిస్తుండటంతో సమీప ప్రాంతాలలో ప్రజలు ఇళ్లొదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.దీనికి పూర్తి బాధ్యత ఆ రాష్ట్రగవర్నర్ దేనని ట్రంప మండిపడ్డారు. చేతకాని గవర్నర్ తప్పుకుంటే మంచిదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మంటలు వ్యాపించిన ప్రాంతంలో నీళ్లు వెదజల్లి మంటలను ఆర్పి ఉంటే సకాలంలో ఈ ముప్పు తప్పేదన్నారు. అందుకు సంబంధించిన జలవనరుల పునరుద్దరణ డిక్లరేషన్ పై గవర్నర్ న్యూసోమ్ సంతకం చేయలేదని విమర్శించారు. వాన నీటి పరిరక్షణ, హిమపాతం కరిగి స్టోర్ అయిన మిలియన్ల గ్యాలన్ల నీటిని అటవీ ప్రాంతంలో వినియోగించి ఉంటే ప్రమాదం ఇంత చేటున జరిగి ఉండేది కాదన్నారు. దీనికి బదులు ఎందుకూ ఉపయోగం లేని చేపల సంరక్షణకు ఆ నీటిని వాడారని దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని డోనాల్డ్ ట్రంప్ కామెంట్ చేశారు. కాలిఫోర్నియా ప్రజలను పట్టించుకోలేదని…ఇప్పుడు అందుకు తగిన ఫలితం అనుభవిస్తున్నారని అన్నారు. ఉత్తర అమెరికా నుంచి కాలిఫోర్నియా రాష్ట్రంలోకి ఈ సీజన్లో మంచు కరిగి ప్రవహిస్తుంటుంది. ఆ నీటిని ఈ డిక్లరేషన్ ద్వారా సరిగా వినియోగించుకుంటే ఇప్పు డీ ముప్పు తప్పేదని ట్రంప్ భావన.
గృహ వినియోగానికే చాలని నీరు..
కాలిఫోర్నియా అడవుల్లో మంగళవారం నుంచి కార్చిచ్చు పెచ్చరిల్లుతోంది. దానిని ఆర్పేందుకు రాత్రంతా ఫైర్ ఫైటర్లతో గ్యాలన్ల కొద్దీ నీటిని వినియోగించినా ఫలితం లేకపోయింది. చివరకు నీరు అడుగంటి మంటలనార్పే పని మధ్యలోనే నిలిచిపోయింది. ప్రస్తుత నీటి డిమాండ్ ను తట్టుకోవడం సాధ్యం కావడం లేదని దీనికి తోడు మున్సిపల్ వాటర్ సప్లయ్ డిమాండ్ కి మించి ఉందని లాస్ ఏంజెలిస్ కౌంటీ పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్ తెలిపింది. మరో వైపు కార్చిచ్చు వల్ల వేలాది ఎకరాల్లో పంట బూడిదైంది.ఇళ్లు దగ్ధమయ్యాయి. వేలాది మంది కట్టు బట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. మలిము, లాస్ఏంజెలిస్ లాంటి ప్రాంతాల్లో నీటివనరులన్నింటినీ వాడేసినా మంటలు అదుపులోకి రావడం లేదు.
ఇద్దరి మృతి..తగులబడిపోయిన ఇళ్లు..
కార్చిచ్చు వల్ల ఇద్దరు చనిపోగా, వెయ్యి ఇళ్లు తగలబడిపోయాయి. గంటకు వందమైళ్ల వేగంతో మంటలు వ్యాపించాయి. లాస్ ఏంజెలిస్ ఏరియాలో లగ్జరీ అపార్టుమెంట్లు, బీచ్‌సైడ్ ఉన్న అనేక విలువైన ఆస్తులు కాలి బూడిదయ్యాయి. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ తో సహా అనేక మందిని ఆప్రాంతంనుంచి తరలి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. ఇప్పటికే హాలీవుడ్ సెలబ్రిటీలు ఆప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. మరోవైపు ట్రంప్ కుమారుడు డాన్ జూనియర్ లాస్ ఏంజెలిస్ అధికారులు నీటి వనరులను ఉక్రెయిన్ కు తరలించడం వల్లనే ఈ సమస్య తలెత్తిందని ఆరోపించారు.
ఓటేసిన వారిని వంచించారు…
ఇదే సంఘటనపై సాఫ్ట్ వేర్ దిగ్గజం ఎలన్ మస్క్ కూడా స్పందించారు. ఇది పూర్తిగా రాష్ట్ర గవర్నర్ గెవిన్ న్యూ సోమ్ వైఫల్యమేనన్నారు.2014లో ప్రజలు జలవనరుల పరిరక్షణ, రిజర్వాయర్ల లో పుష్కర నీటి నిల్వలు కల్పిస్తారన్న నమ్మకంతో ఓటేస్తే ఇవాళ వారంతా అగ్నిప్రమాదానికి బలవ్వాల్సి వచ్చిందని ఎలన్ మస్క్ విమర్శించారు.