చదువే రాజకీయాల్లో నాకు పెట్టుబడి అయిందని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మా నాన్న క్రమశిక్షణతో ముందుకు నడిపించారని, మాకు ఇచ్చిన ఆస్తి చదువు అని పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని సబ్బవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హోం శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబుతో కలిసి శనివారం లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్బంగా హోం శాఖ మంత్రి వంగళపూడి అనిత మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం జరిగిందని ఆమె తెలిపారు, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తున్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ప్రయోజనాలపై విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం సహాపంక్తి భోజనాన్ని తిన్నారు. కళాశాల నిర్వహణపై ముందుగా కళాశాల ప్రిన్సిపాల్ , అధ్యాపకులు, సిబ్బంది తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు అంటే ఎంతో కొంత చిన్న చూపు ఉంటుంది.అదే ప్రైవేట్ కళాశాల్లో లక్షలు ఖర్చు చేస్తారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుల్లో రాణించాలి. విద్యా రంగంలో అనేక సంస్కరణలు, ఉన్నత ప్రమాణాలతో విద్యా బోధన జరిగేలా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారన్నారు.
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. అభివృద్ధిలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ ని నిలవడానికి సీఎం విశేషంగా కృషి చేస్తున్నారని వర్ణించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల 15 రోజుల్లోనే విద్యారంగంలో అనేక సంస్కరణలను సీఎం తెచ్చారన్నారు. ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధికి కేంద్రంగా నిలపడమే లక్ష్యంతో అహర్నిశలు సీఎం కృషి చేస్తున్నారన్నారు. ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత విద్య వైపు వెళ్లే అవకాశాలను విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. భోజనం తెచ్చుకోలేని విద్యార్థులలో క్రమ శిక్షణ తగ్గడం, డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించిందన్నారు. పాఠశాలల్లో మాదిరిగా జూనియర్ కళాశాలలకు మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డ్రాప్ అవుట్స్ వందల సంఖ్యలో ఉండగా, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యాబోధన మరింత మెరుగుపరిచి నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం అందిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంపద సృష్టించే సుదీర్ఘ అనుభవం కలిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో విద్యార్థులు సాధికారత దిశగా పయనిస్తున్నారని మంత్రి తెలిపారు.
రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం, ఎన్టీఆర్ పింఛన్ అమలు చేయడం శుభపరిణామన్నారు. లోటు బడ్జెట్ ను లెక్క చేయకుండా పాఠశాలలకు ఇస్తున్న కోడిగుడ్ల బకాయిలు రూ.200 కోట్లు చెల్లించామన్నారు. ప్రజాహితం కోరే ప్రభుత్వంగా ప్రజలలో ముద్ర వేసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 44 వేల పాఠశాలల్లో 33 లక్షల మంది విద్యార్థులకు పౌష్టికాహారంతో మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్ధంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నిష్ణాతులైన ఆధ్యాపకులతో ఇక్కడ విద్యా బోధన అందిస్తున్నట్లు తెలిపారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలకు గురై మీ బంగారు భవిష్యత్తును చెడ కొట్టుకోవద్దని అభ్యర్థించారు. విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావలసిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై ఉందన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని అభివృద్ధిలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుందన్నారు. ఇంటర్మీడియట్ విద్య జీవితంలో చాలా కీలకమైన ఘట్టమని ఆయన అభివర్ణించారు. ఆ సమయంలో స్నేహితులు, చుట్టు వాతావరణం మంచిగా ఉండాలని, తన జీవిత అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు.
జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ విద్యావంతులు అధికంగా ఉంటేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందన్నరు ,ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలు నడుస్తున్నాయని. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండి బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. మంచి పోషకాలు ఉండేలా నాణ్యమైన భోజనం అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంద న్నారు. ప్రతి విద్యార్థికి ఆరు రోజులు కోడిగుడ్డు అందిస్తామన్నారు. విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేస్తూ, మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రు లకు భారం తగ్గించేలా ఈ కార్యక్రమం ప్రారంభిస్తు న్నట్లు చెప్పారు. ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం సత్సంకల్పంతో జూనియర్ కళాశాలల్లో ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.
జిల్లా వ్యాప్తంగా 20 కళాశాలల్లో పథకం అమలు అవుతుందని, 5,078 మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని చెప్పారు. విద్యార్థులకు ఈ పథకం ఎంతో ఉపయుక్తమన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఎస్సీ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో మరమ్మతుల కొరకు రూ.మూడు కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. మూడు నెలలలో పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఎస్టీ, బీసీ వసతి గృహాలలో మరమ్మతుల కొరకు మినరల్ ఫండ్ నుంచి నిధులు వెచ్చిస్తామన్నారు. ప్రభుత్వం కల్పించే అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కష్టపడి చదివి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ బి సుజాత, పెందుర్తి నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ గండి బాజ్జి, సబ్బవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల పప్రిన్సిపాల్ మురాళధర్ మరియు సిబ్బంది, టిడిపి, బిజెపి, జనసేన నాయకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.