పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మాజీ కేంద్రమంత్రి సూదిని జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. సింగూరు ప్రాజెక్టుకు మంత్రి దామోదర రాజనర్సింహ తండ్రి, దివంగత మంత్రి రాజనర్సింహ పేరు పెట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
జూరాల నుంచి కృష్ణా జలాలను మహబూబ్ నగర్ జిల్లాలో కొత్తగా మరిత ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఉన్న మార్గాలు, ప్రత్యేమ్నాయాలను పరిశీలించేందుకు సాంకేతిక నిపుణుల కమిటీని నియమించాలని నిర్ణయం తీసుకుంది. ఎక్కడ నీటి లభ్యత ఉంది..? ఎక్కడ నుంచి ఎంత నీటిని తీసుకునే వీలుంది..? ఎక్కడెక్కడ రిజర్వాయర్లు నిర్మించాలి..? ఇప్పుడున్న ప్రాజెక్టులకు మరింత నీటిని తీసుకునే సాధ్యాసాధ్యాలపై కమిటీ అధ్యయనం చేస్తుంది.
మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను హైదరాబాద్ తాగునీటికి తరలించే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2, ఫేజ్-3 కి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో 15టీఎంసీలకు ప్రతిపాదించిన ఈ పథకాన్ని భవిష్యత్ అవసరాల దృష్ట్యా 20 టీఎంసీలకు పెంచేందుకు ఆమోదం తెలిపింది.
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ చేసేందుకు కేబినేట్ ఆమోద ముద్ర వేసింది.