31.2 C
Hyderabad
Saturday, April 4, 2026

Live Video

spot_img

వెంటాడుతోన్న కాళేశ్వరం – అధికారులకు ఉచ్చు బిగుస్తున్న ప్రభుత్వం

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలనే కాదు.. అధికారులను కూడా వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలపై న్యాయ విచారణ కమిషన్‌ విచారణ కొనసాగిస్తోంది. పలువురు అధికారులు, ప్రభుత్వ పెద్దలను కమిషన్‌ ఇప్పటికే విచారించింది. అయితే, ఇప్పుడు అధికారులపై చర్యలు కూడా మొదలయ్యాయి. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పూర్తికాకముందే సీసీ ఇచ్చిన ఇద్దరు అధికారులపై సర్కారు చర్యలు తీసుకుంది. చార్జ్‌మెమోలు జారీచేసింది. పదిరోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అధికారులపై అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లే ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే అయినప్పటికీ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించింది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డ బ్యారేజీ పూర్తి కాకుండానే కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఎల్​అండ్‌టీకి అప్పటి అధికారులు కంప్లీషన్​ సర్టిఫికెట్ -సీసీ జారీచేశారు. దీనిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. బ్యారేజీకి ఆ సమయంలో ఎస్ఈగా పనిచేసిన బి.వి. రమణా రెడ్డి, ఈఈ తిరుపతిరావుకు చార్జ్‌ మె​మోలు జారీ చేశారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఇరిగేషన్​ శాఖ సెక్రటరీ రాహుల్​ బొజ్జా చార్జ్‌ ఈ మె​మోలు ఇచ్చారు. ఏపీ సివిల్​ సర్వీసెస్​ రూల్స్​ 1991లోని రూల్​ 20 ప్రకారం ఇద్దరు అధికారులపై విచారణ జరపాలని మెమోల్లో వివరించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, నిర్మాణ సంస్థకు లబ్ధి చేకూర్చడం వంటి కారణాలతో ఈ ఇద్దరు అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని ఉత్తర్వుల్లో ప్రశ్నించారు. నోటీసులు అందిన 10 రోజుల్లో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని, వ్యక్తిగతంగా వచ్చి విచారణ అధికారులకు వివరణ డాక్యుమెంట్లను సమర్పించాలని మెమోల్లో పేర్కొన్నారు. ఇచ్చిన గడువులోపుగా వివరణ ఇవ్వకుంటే విచారణ చేపట్టాల్సి ఉంటుందన్నారు. విచారణాధికారిపై రాజకీయ ఒత్తిళ్లు తీసుకురావాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా ఉత్తర్వుల్లో హెచ్చరించారు.

ఇక, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి అప్పుడు అధికారులు ముందుగానే జారీచేసిన సీసీని గత యేడాది సెప్టెంబర్​ 24వ తేదీన ప్రభుత్వం రద్దు చేసింది. అందుకు సంబంధించి నిర్మాణ సంస్థ ఎల్​అండ్‌​టీకి ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​ నోటీసులు కూడా పంపించింది. బ్యారేజీ కంప్లీట్​అయినట్టు ఇచ్చిన సర్టిఫికెట్‌ ​రిటర్న్​ చేయాల్సిందిగా నోటీసుల్లో కోరారు. వాస్తవానికి కంప్లీషన్​ సర్టిఫికెట్​ ఇచ్చే నాటికి బ్యారేజీ వద్ద పెండింగ్​లో ఉన్న పనుల విలువ దాదాపు రూ.150 కోట్ల వరకు ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఆ పనులు పూర్తికాకముందే సీసీ ఇవ్వాలని అధికారులకు నిర్మాణ సంస్థ ఎల్​ అండ్​ టీ అప్పుడే మూడుసార్లు లెటర్లు పంపించిందట. 2019 జూన్​ 21వ తేదీన అప్పటి సీఎం కేసీఆర్​ బ్యారేజీని ప్రారంభించగా.. అదే యేడాది ఆగస్టు 6వ తేదీన సీసీ​ ఇవ్వాలంటూ అప్పటి ఈఈకి నిర్మాణ సంస్థ మొదటిసారి లేఖ రాసింది. అయితే, డ్యామేజ్ లున్నాయని, వాటి రిపేర్లు పూర్తి చేయాలని సంబంధిత సంస్థకు అధికారులు 2020లో లేఖ రాశారు. ఆ పనులను చేపట్టకుండానే.. మిగిలిపోయిన పనులను చేయకుండానే మరోసారి 2020 అక్టోబర్​ 12న బ్యారేజీ అధికారులకు లేఖ రాసింది. డ్యామేజీలు బాగు చేయాలని, మిగిలిన పనులు పూర్తి చేయాలని కోరుతూ నిర్మాణ సంస్థకు నాటి ఈఈ 2021 ఫిబ్రవరి 17న లేఖ రాశారు. అయినా కూడా వాటిని పట్టించుకోకుండా 2021 మార్చి 10న సర్టిఫికెట్​ ఇవ్వాలంటూ అధికారులకు మరోసారి లేఖ రాసింది. వాస్తవానికి ఎల్‌ అండ్‌ టీ సంస్థ రెండోసారి రాసిన లేఖలో బ్యారేజీకి దిగువన డ్యామేజీలున్నాయని, వాటికి రిపేర్లు చేయాల్సి ఉందని పేర్కొంది. కంప్లీషన్​ సర్టిఫికెట్​ ఇచ్చే ముందు నిర్మాణ సంస్థ నుంచి అండర్‌ టేకింగ్​ తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కానీ, అవేవీ లేకుండానే.. మూడోసారి లేఖ రాసిన వెంటనే ఆదరబాదరగా నిర్మాణ సంస్థకు అధికారులు సీసీ ఇచ్చారు. 2021 మార్చి 15న నాటి మేడిగడ్డ ఈఈ తిరుపతి రావు కంప్లీషన్​ సర్టిఫికెట్‌ జారీ చేశారు. దానిపై అప్పటి ఎస్ఈ సంతకం చేశారు. నిర్మాణ సంస్థ లేఖ రాసిన 5 రోజుల్లోనే సీసీ ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాటి ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే నిర్మాణ సంస్థకు వెంటనే సీసీ జారీ చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com