బీజేపీ శాసనసభ్యుడు పార్థసారధి
నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆదోని బీజేపీ శాసనసభ్యులు పార్థసారధి టీడీపీ నాయకులు జేసీప్రభాకర్ రెడ్డిని హెచ్చరించారు. శుక్రవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఒకప్పుడు నడిచినట్లు ఇప్పుడు నడవాలంటే కుదరదని ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వం అని జేసీని హెచ్చరించారు పార్థసారధి. మా పార్టీ కార్యకర్తలకు జేసీ బస్సులు కాల్చాల్సిన అవసరం లేదని పార్థసారధి స్పష్టం చేశారు. ఆయన బీజేపీ వాళ్ళు బస్సు తగలబెట్టారని ఏ ఆధారంతో ఆరోపిస్తున్నారని ప్రశ్నించారు. నాయకుల మాటలు, చేతలు ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలని రౌడీలు, గుండాలు మాట్లాడే బాష మాట్లాడితే ప్రజానాయకుడిగా అనర్హుడని పార్థసారధి అన్నారు. బీజేపీ జోలికి వస్తే ఎవ్వరినీ వదిలిపెట్టమని ఎమ్మెల్యే పార్థసారధి తీవ్ర స్వరంతో హెచ్చరించారు. మరో సారి బీజేపీ కార్యకర్తలపై ఆరోపణలు చేసినా, దూషణలు చేసినా ఊరుకునే ప్రశక్తి లేదని పార్థసారధి జేసీ ప్రభాకర్ రెడ్డిపై మండిపడ్డారు.