ప్రపంచస్థాయి క్రీడాకారులను తయారు చేయడం, ఆస్థాయి ప్లేయర్లతో పోటీ పడే విధంగా మన ప్లేయర్లను తయారు చేయడమే లక్ష్యంగా తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ ఉండబోతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ఎన్నుకున్న సందర్భంగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఇండియా సభ్యులు మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అండర్ – 19 ర్యాంకింగ్ టోర్నమెంట్ బ్రౌచర్‌ను శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆల్ ఇంగ్లండ్ టోర్నమెంట్ గోపి చంద్ కైవసం చేసుకున్న తరువాత గోపిచంద్ ప్రపంచానికి పరిచయం అయ్యారన్నారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో చీఫ్ కోచ్, అసోసియేషన్ కు వైస్ ప్రెసిడెంట్‌గా ఉండటం గర్వకారణమన్నారు. తెలంగాణలో క్రీడలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సిఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రాబోయే దశాబ్ద కాలంలో తెలంగాణ నుంచి ఒలంపిక్స్ లో మెడల్స్ సాధించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రాబోయే రోజుల్లో వందలాది మంది గోపీ చంద్ లను తయారు చేయాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు. గ్రామీణ స్థాయిలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీయాలని ప్రభుత్వం ప్రయత్నం మొదలు పెట్టిందని చెప్పారు. క్రీడలను ప్రోత్సహించడానికి గోపి చంద్ ఆలోచనలు సర్కార్ తీసుకుంటుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కొత్తగా ప్రైవేట్ పాఠశాలల్లో స్పోర్ట్స్ గ్రౌండ్ ఉంటేనే అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. స్పోర్ట్స్ పాలసీ జీవోను ప్రతి ప్రైవేట్ పాఠశాల ఫాలో కావాల్సిందేనన్నారు. కొన్ని పాఠశాలలు, కళాశాలలు మెకానికల్ లైఫ్ స్టైల్ కు అలవాటు పడ్డారని, అలాంటి పరిస్థితులు ఇకపై ఉండకూడదన్నారు.
మంత్రిని కలిసిన సందర్భంగా గోపిచంద్ పుల్లెల మాట్లాడుతూ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కు శ్రీధర్ బాబు ప్రెసిడెంట్ అయ్యాక మొదటిసారి కలిసామన్నారు. ఇవ్వాల్టి నుంచి జనవరి 10వరకు ఆల్ ఇండియా జూనియర్ ర్యాంక్ టోర్నమెంట్ జరుగుతుందన్నారు. ఈ టోర్నమెంట్లో ఈనెల 7వ తేదిన శ్రీధర్ బాబు పాల్గొంటారని చెప్పారు. దేశంలో బ్యాట్మెంటన్ కు మంచి గ్రోత్ ఉందిన్న గోపిచంద్.. వచ్చే ఏడాది నుంచి అంతర్జాతీయ టోర్నమెంట్లు నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు నిర్ణయం ఆహ్వానించదగిందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే క్రీడాకారులకు మౌళిక సదుపాయాలు అవసరమన్నారు. క్రీడాకారులకు ఉద్యోగాలు, ప్రోత్సాహకాలు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అలాగే, స్పోర్ట్స్ పై జీఎస్టీ ప్రోత్సాహకరంగా ఉంటుందని గోపీచంద్ అభిప్రాయపడ్డారు.ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని ఆకాంక్షించారు.