తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. కొత్త సంవత్సరం ఒకటో తేదీ నుంచి చలి గాలులు తీవ్రమయ్యాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 7.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి గాలులకు వ్యవసాయ పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత వ్యవసాయ పనులు మొదలు పెడుతున్నారు.
రాజధాని హైదరాబాద్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నగర శివార్లలో పొగమంచు పడుతోంది. గచ్చిబౌలి పరిధిలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఈ రోజు ఉదయం 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. హైదరాబాద్ శివార్లలోని కొంపల్లి, పటాన్చెరుతో పాటు ఎల్బీనగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో పొగమంచు కురియడంతో నగర వాసులు చలికి వణికి పోయారు.
కొద్ది రోజుల నుంచి హైదరాబాద్లో 15 నుంచి 19 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉన్నట్టుండి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పోడిపోయాయి. హెచ్సీయూలో 11 డిగ్రీల సెల్సియస్, మౌలాలీలో 12.1, రాజేంద్రనగర్లో 12.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.