జట్టులో చోటు కోల్పోయిన కెప్టెన్
నిప్పులు చిమ్ముతూ
నింగికి నే ఎగిరిపోతే
నిబిడాశ్చర్యంతో వీరే…
నెత్తురు కక్కుతూ
నే..నేలకు రాలిపోతే
నిర్ధాక్షిణ్యంగా వీరే…
-శ్రీశ్రీ
నాడు మహాకవి శ్రీశ్రీ చెప్పిన మాటలు నేడు టీమ్ ఇండియా లెజెండరి క్రికెటర్, కెప్టెన్ రోహిత్ శర్మ విషయంలో అక్షర సత్యాలయ్యాయి. ఎన్నో మ్యాచ్ లను ఒంటి చేత్తో గెలిపించిన రోహిత్ శర్మను నేడు అనామకుడిలా జట్టు లోంచి తొలగించడం అభిమానులకు జీర్ణం కావడం లేదు. 11 మంది ఆడితేనే జట్టు గెలుస్తుంది. అది ఒక్కరిపై ఆధారపడి ఆడటం అనేది దాదాపు అసాధ్యం. అలాంటి పరిస్థితుల్లో జట్టు కెప్టెన్ని బాధ్యున్ని చేయడం న్యాయమా? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు .
బార్డర్- గవాస్కర్ సిరీస్ లో జరిగిన నాలుగు టెస్టుల్లో యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ మాత్రమే బాగా ఆడుతున్నారు. మిగిలిన వారందరూ ఏదో ఒక మ్యాచ్ లో మెరిపించి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్ ని మాత్రమే బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం అని అంటున్నారు. లేదంటే రోహిత్ చెప్పినట్టు ఆఖరి టెస్ట్ వరకు ఆగి, తనంతట తను రిటైర్మెంట్ ప్రకటించే వరకు వెయిట్ చేస్తే, అతనికి తగిన గౌరవం ఇచ్చినట్టు అయ్యేదని అంటున్నారు. అయితే రోహిత్ కెప్టెన్సీ పరంగా కాకుండా జట్టులో ఆటగాడిగా కూడా విఫలమవుతున్నాడు. ఇది తనపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. ఒక ఏడాదిగా కెప్టెన్ రోహిత్ శర్మ ఆట తీరు బాగుండటం లేదు. ఇంగ్లాండ్ సిరీస్ నుంచి మొదలైంది. అయితే అక్కడ యశస్వి, గిల్, సర్ఫరాజ్ యువ ఆటగాళ్ళ దయవల్ల బతికి బయటపడ్డాడు.
తర్వాత కోచ్ గంభీర్ వచ్చాడు. శ్రీలంక సిరీస్ కి వెళ్లారు. అక్కడ వన్డే సిరీస్ ఓడిపోయింది. తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ తో 3-0 తో క్లీన్ స్వీప్ అయింది. ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో ఘోరాతి ఘోరంగా ఆడుతోంది. ఒక కెప్టెన్ గా ఏ దశలోనూ రోహిత్ శర్మ జట్టుని ఆదుకోవడానికి ప్రయత్నించడం లేదనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. దీంతో అతనిపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. అది ఆటపై పడుతోంది. ఒకానొక దశలో కోచ్ గౌతమ్ గంభీర్ ని బీసీసీఐ పెద్దలు వివరణ అడిగి తీసుకున్నారు. అప్పుడే కెప్టెన్ పై తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం.
అయితే గౌతమ్ గంభీర్ తీసుకునే నిర్ణయాలు కూడా జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. జట్టులోకి అనవసరంగా కొందరిని తీసుకురావడం, వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లు మార్చడం, కొత్తవాళ్లని అటు ఇటు చేయడం, బోర్డు పెద్దలను గౌరవించకపోవడం, తనకు నచ్చిన వాళ్ళను తెచ్చుకోవడం.. అంతా తన కంట్రోల్ లోనే ఉండాలనుకోవడం.. ఇవన్నీ జట్టులో అంతర్గత కలహాలకు దారి తీస్తున్నట్టు తెలిసింది. మరోవైపు కోచ్ గంభీర్ కి కెప్టెన్ రోహిత్ కి మధ్య అంతగా సఖ్యత లేదని సమాచారం. మొత్తానికి అటొచ్చి ఇటొచ్చి రోహిత్ శర్మని బలి పశువును చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆల్రెడీ ఐదో టెస్టు మొదలైంది. మనవాళ్లు తొలిరోజు యథాత థంగా ఆడుతున్నారు. ఈసారి బుమ్రాకి కెప్టెన్సీ ఇచ్చారు. మరి తను తొలిటెస్ట్ తరహాలో చివరి టెస్ట్ ని గెలిపిస్తాడా? లేక రోహిత్ మార్గంలో నడుస్తాడా? అనేది వేచి చూడాల్సిందే. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ అందించిన రోహిత్ ని ముంబై యాజమాన్యం ఇదే రీతిలో అవమానించింది. టీమిండియాకి ఒక ఆటగాడిగా, జట్టు కెప్టెన్ గా ఒంటి చేత్తో ఎన్నో విజయాలు అందించిన రోహిత్ శర్మని ఇలా పక్కన పెట్టడం కోచ్ గౌతమ్ కి, బోర్డు పెద్దలకి ఎంత మాత్రం సమచితం కాదు. ఇది మిగిలిన ఆటగాళ్లపై ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు.. ఇది ఇండియన్ టీమ్ కి, ఇండియన్ క్రికెట్ కి మంచిది కాదని నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.