ప్రేమ కోసం సొంత ఊరు దాటాడు.. దేశాన్ని దాటాడు.. గుట్టు చప్పుడు కాకుండా రెండు దేశాల సైనికుల కళ్లు గప్పి దేశం కాని దేశంలో చొరబడ్డాడు. తీరా అక్కడి వెళ్లాక ఏ ప్రేయసి కోసమైతే వెళ్లాడో.. ఆమె పొమ్మంది.. ఎందుకొచ్చావంది.. దీంతో ప్రాణంగా ప్రేమించిన ఆ ప్రేమికుడి ప్రాణాల మీదకు వచ్చింది పంచాయితీ. ఇదో ఫేస్‌బుక్‌లో పరిచయమై అడ్డంగా బుక్కైన ఓ యువకుడి ప్రేమ.. కాదు కాదు.. దీన గాథ.
యూపీలోని అలీగర్‌కు చెందిన బాదల్ బాబుకు ఫేస్‌బుక్‌లో ఓ యువతి పరిచయమైంది. ఆమె పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉంటుంది. చూపులు కలవకపోయిన మాటలు కలిశాయి. ఇంకేముంది ప్రేయసి కోసం ప్రాణాలకు తెగించి, సరిహద్దు సైనికుల కళ్లుగప్పి బార్డర్ దాటేశాడు. తీరా అక్కడికి చేరుకున్నాక ఆ యువతి నువ్వంటే ఇష్టమే కానీ… పెళ్లంటే కష్టమనేసింది. దీంతో బాబుకు కళ్లు బైర్లు కమ్మాయి. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అక్రమంగా చొరబడ్డందుకు పాకిస్థాన్ ఫారిన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పాక్ జైళ్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు బాబు. ఈ కేసులో నెక్ట్స్ హియరింగ్ జనవరి 10న ఉంది.
ప్రేమకు సరిహద్దులుండవని ఇప్పుడే కాదు గతంలో కూడా జరిగాయి. లాస్ట్ ఇయర్ సీమ హైదర్ పాకిస్థాన్ నుంచి యూపీకి వచ్చింది. అప్పుడు పబ్‌జీ గేమ్‌లో స్టార్టయిన వీరిద్దరి లవ్ పెళ్లి వరకు వచ్చింది. ఇక పాకిస్థాన్‌కు చెందిన మరో యువతి ఇండియా అబ్బాయిని ప్రేమించి.. నేపాల్‌కు చేరుకొని అక్కడ పెళ్లి చేసుకుంది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలానే ఉన్నాయి. చాలా వరకు హ్యాపీ ఎండింగ్సే కానీ.. ఇప్పుడు బాదల్ బాబు పరిస్థితే అగమ్యగోచరంగా మారింది. అతని ఫ్యూచర్ ఏంటన్నది ఇప్పుడో ప్రశ్నార్థకంగా మారింది.