ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహా సభలకు హైదరాబాద్ వేదిక కాబోతోంది. మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఈ వేడుకలు జరగబోతున్నాయి. ఉత్సవాల కోసం హైటెక్స్ ప్రాంగణం సిద్ధమయ్యింది. అంగరంగవైభవంగా వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లను ఏకం చేసి, సంఘటిత పరిచి తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, సంప్రదాయ విలువలు, తెలుగు జాతి వారసత్వ సంపదను చాటిచెప్పేలా ఈ మహాసభలు నిర్వహించబోతున్నారు. గడిచిన తరం జ్ఞాపకాలను నేటితరం ఆస్వాదించేలా.. వాటిని భావితరాలకు కూడా అందించేలా ఈ మహాసభలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మహా సభల్లో సాహిత్యం, ఇతర రంగాలు, పలు అంశాలపై సమావేశాలు, చర్చలు, సమాలోచనలు, కళా ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ ఉత్సవాలకు తరలివస్తున్నారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, కళాకారులు, సాహితీ వేత్తలు, వ్యాపార ప్రముఖులతో పాటు.. ఇతర రంగాలకు చెందిన వాళ్లు కూడా హాజరవుతున్నారు. శుక్రవారం జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. అలాగే, ఆదివారం జరిగే ముగింపు వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.
ఈ వేడుకల్లో పలువురు పారిశ్రామిక వేత్తలతో పాటు.. ఇతర రంగాలకు చెందిన కొందరు తెలుగు ప్రముఖులను కూడా ఆహ్వానించి సత్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభల్లో ప్రపంచ తెలుగు సమాఖ్య అనుబంధ సంస్థల ప్రతినిధుల సమావేశం, వాణిజ్య, పారిశ్రామిక వేత్తల సదస్సులు కూడా ఏర్పాటు చేశారు. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా జానపద కళారూపాల ప్రదర్శన, కూచిపూడి నృత్య రూపకాలు, సాహితీ రూపకములు, భాషా, సంస్కృతులపై ప్రముఖుల ప్రసంగాలు, సినీ కళాకారుల ప్రదర్శనలు, సినీసంగీత విభావరి, తెలుగువారి చేనేత వస్త్ర అందాల ప్రదర్శనలతో పాటు మరికొన్ని ఆసక్తికర కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు. యునికార్న్ కంపెనీలు స్టార్టప్ కంపెనీలు కూడా ఇందులో పాల్గొననున్నాయి. విదేశాల్లో ఉన్న తెలుగు సంఘాల నాయకులు కూడా ఈ మహాసభల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్నట్లుగా నిర్వాహకులు చెప్పారు.