మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డులను ప్రకటించింది కేంద్రం. ఇందులో మొత్తం నలుగురు క్రీడాకారుల పేర్లను అనౌన్స్ చేసింది. ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్‌కు ఖేల్‌రత్న దక్కింది. షూటర్ మను భాకర్, హాకీ ప్లేయర్ హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెటిక్స్ ప్రవీణ్ కుమార్‌కు ఖేల్ రత్న అవార్డులను ప్రకటించింది. ఈనెల 17న రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.
చెస్‌కు సంబంధించి గ్రాండ్ మాస్టర్ గుకేష్ దొమ్మరాజు , హాకీకి సంబంధించి హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్, షూటింగ్లో మను భాకర్‌కు అవార్డులు వచ్చాయి. ఈ అవార్డు కింద 25 లక్షల రూపాయల నగదు, పతకం, ప్రశంసాపత్రం లభిస్తుంది.
గత ఏడాది జులైలో జరిగిన పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో మెరిశారు మను భాకర్. షూటింగ్లో రెండు మెడల్స్ అందుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విమెన్స్ కేటగిరీలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. 221.7 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. ఖేల్ రత్న అవార్డు విషయంలో ఆమెకు అన్యాయం జరిగిందటూ ఇటీవలే ఓ ప్రచారం జరిగింది. ఆమెను నామినేషన్ చేయలేదనే వివాదం వెలుగులోకి వచ్చింది. తన దేశం కోసం ఆడటం తనకు గొప్ప అని, నామినేషన్ దాఖలు చేసే సమయంలో తన తరఫున పొరపాటు జరిగిందంటూ చెప్పారు మనుభాకర్. ఇప్పుడీ ఆమెకు అవార్డు రావడంతో వివాదానికి ఎండ్ కార్డ్ పడినట్టైంది. ఇక గుకేష్ రీసెంట్గా వరల్డ్ చెస్ చాంపియన్ షిప్ ఫైనల్స్‌లో గెలిచి భారత్ సత్తాను చాటారు.
దేశంలో వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ ప్రతిభను కనపరిచిన క్రీడాకారులకు ప్రతి సంవత్సరం ఖేల్ రత్న అవార్డులను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పేరిట ఈ పురస్కారాలు వారికి అందుతుండేవి. 2021 ఆగస్టు 6వ తేదీన దీని పేరును మార్చింది కేంద్ర ప్రభుత్వం. రాజీవ్ గాంధీ స్థానంలో ప్రముఖ హాకీ ప్లేయర్ మేజర్ ధ్యాన్‌చంద్ పేరును పెట్టింది. ఈ అవార్డుకు అర్హత గల క్రీడాకారుల పేర్లతో కూడిన జాబితాను నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.. కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తుంటుంది