ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి వాడకం, అమ్మకాలు, స్మగ్లింగ్‌పై అసెంబ్ఈల స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఏపీలో ఉన్న పరిస్థితిని స్పీకర్ స్పష్టంగా చెప్పారని వివిధ వర్గాల నుంచి కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం వైఫల్యానికి ఇది పరాకాష్ట అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణా, వాడకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గంజాయి విపరీతంగా సప్లై అవుతోందని, గంజాయి కేసుల నుంచి తప్పించమని కొంతమంది మా దగ్గరికి వస్తున్నారని స్పీకర్ చెప్పుకొచ్చారు. ఈక్రమంలో తమ పార్టీకి చెందిన వారు కూడా తన వద్దకు వస్తున్నారని చెప్పారు.రాష్ట్రంలో కొంతకాలంగా గంజాయి రవాణా పెరిగిందని, గంజాయి సంబంధిత కేసుల నుంచి తమను తప్పించాలని టీడీపీకి చెందిన నేతలే తన వద్దకు వస్తున్నారని అన్నారు. వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదని స్పీకర్ స్పష్టం చేశారు.
విశాఖ నుంచి నర్సీపట్నం వెళ్లే సమయంలో ఎంతోమంది గంజాయి సేవిస్తూ కనిపిస్తున్నారని స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న పిల్లల సైతం మదాలు దగ్గర కూర్చొని గంజాయిని తాగుతున్నారని, గంజాయి తాగవద్దని చెప్పిన ఒక పెద్దాయనను నర్సీపట్నంలో చితకబాదారని గుర్తుచేశారు. గంజాయిని రాష్ట్రంలో రూపుమాపకపోతే పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.