– షెడ్యూల్డ్ కులాల్లో ఉప వర్గీకరణ పై వివరణాత్మక ఆధ్యయనం
– కరీంనగర్‌లో బహిరంగ విచారణ
– షెడ్యూల్డ్ కుల సంఘాల నుంచి 128 దరఖాస్తులు స్వీకరణ
ఎస్సీ కులాల ఉప వర్గీకరణ కోసం నిర్వహించిన బహిరంగ విచారణలో తమ దృష్టికి వచ్చిన అభ్యర్థనలు, విన్నపాలపై పూర్తిస్థాయి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తామని ఎస్సీ ఏకసభ్య కమిషన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో వివిధ ఎస్సీ కులాల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తున్నామని తెలిపారు.
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల విచారణ కమిషన్ ఆధ్వర్యంలో బుధవారం షెడ్యూల్డ్ కులాల్లో ఉప వర్గీకరణపై వివరణాత్మక ఆధ్యయనం కోసం కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో బహిరంగ విచారణ నిర్వహించారు. వర్గీకరణపై ఉమ్మడి జిల్లా పరిధిలోని వివిధ ఎస్సీ కుల సంఘాలు ఇచ్చిన దరఖాస్తులను ఏకసభ్య కమిషన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ స్వీకరించారు.
ఈ సందర్భంగా ఏక సభ్య కమిషన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ మాట్లాడుతూ షెడ్యూల్డ్ వివిధ ఎస్సీ కుల సంఘాల నుంచి 128 వినతులు, అభ్యర్ధనలు అందాయని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన న్యాయపరమైన అంశాలు, ఉద్యోగ, సామాజిక పరిస్థితులు, చరిత్రాత్మక వ్యవహారాలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం కమిషన్ ను ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల కుల సంఘాల అభ్యర్థనలు, వినతులు సేకరించి ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక అందిస్తామని పేర్కొన్నారు. బహిరంగ విచారణ జరగకంటే ముందు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఏకసభ్యకమిషన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేశారు. పలు అంశాలను చర్చించారు. అనంతరం సోషల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ ను ఘనంగా సన్మానించారు.కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల పెద్దపల్లి జిల్లాల నుంచి ఎస్సీ కుల సంఘాల నాయకులు ప్రతినిధులు పెద్ద సంఖ్యలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగులీశ్వరరావు, ఆర్డీఓ కే మహేశ్వర్, జగిత్యాల డిఎస్సి డివో రాజకుమార్, సిరిసిల్ల డీఎస్సీడీవో విజయలక్ష్మి, ఎస్ డబ్ల్యూ ఓ లు తిరుపతి, విజయపాల్ రెడ్డి, పలువురు అధికారులు, వివిధ ఎస్సీ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మల్కాపూర్ లో ఎస్సీ కాలనీ సందర్శన :
కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలోని ఎస్సీ కాలనీని ఏకసభ్య కమిషన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్సీలతో ప్రత్యేకంగా మాట్లాడారు. వసతుల కల్పన, మౌలిక సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన కాలనీ వాసులకు సూచించారు.