ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని రాషట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఆటో కార్మికుల పై చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాల్లో వారి సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. మెట్రో వచ్చిన తర్వాత ఇతర రవాణా వాహనాలపై ప్రభావం పడిందని మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే కేవలం ఆటోలపైనే ప్రభావం పడిందంటూ ఆరోపించడం తప్పన్నారు. బస్సులు ప్రయాణికుల ఇంటికి వెళ్లడం లేదన్నారు. గతంలో లాగానే బస్స్టాండ్ల నుంచే బస్సులు వెళ్తున్నాయన్నారు. ప్రజలు ఇంటి దగ్గర నుండి బస్స్టాండ్కి వెళ్ళడానికి ఆటలను వాడుతున్నారని అన్నారు. ఆటో కార్మికులకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇస్తామని చెప్పిన మాట వాస్తవమే అయినా.. బీఆర్ఎస్ పార్టీ నిర్వాకం వల్లే రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం కారణంగా ఈ సంవత్సరం ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించలేకపోయామని పొన్నం ఎదురుదాడి చేశారు. భవిష్యత్తులో ఆటో కార్మికులను కచ్చితంగా ఆదుకుంటామని, ఆ బాధ్యత తమ ప్రభుత్వానికి ఉందన్నారు. నిజంగానే బీఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడైనా రవాణా శాఖ మంత్రి దృష్టికి ఆటో డ్రైవర్ల సమస్యలను తీసుకొచ్చారా? అని పొన్నం ప్రశ్నించారు. రాజకీయాల కోసం నిరసనలు తెలియజేయడం మానాలని, ప్రజాస్వామికంగా ఆటో కార్మికులను తీసుకుని వస్తే.. సమస్యలపై చర్చిద్దామని పొన్నం ప్రభాకర్ సూచించారు.