31.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

జమిలిబిల్లుపై పార్లమెంటులో కీలక పరిణామం

లోక్‌సభతో పాటు.. రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించిన ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ బిల్లు విషయంలో పార్లమెంటులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ బిల్లు ఎట్టకేలకు పార్లమెంటు ముందుకు వచ్చింది. ఈ బిల్లుకోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు.. మరో బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ముందుగా ఈ బిల్లును సభ ముందు ఉంచగా కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీ సహా ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎన్డీఏ మిత్రపక్షాలు మాత్రం బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. విపక్షాలు మాత్రం డివిజన్‌ కోరాయి. దీంతో, స్పీకర్‌ ఓం బిర్లా ‘వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌’ బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్‌ నిర్వహించారు. జమిలి ఎన్నికల బిల్లుపై సభలో చర్చకు తీసుకోవాలా వద్దా.. అనే అంశంపై సభలో ఓటింగ్‌ జరిగింది. మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓటు వేయడంతో స్పీకర్ అనుమతి తీసుకుని కేంద్ర న్యాయశాఖమంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ బిల్లులు ప్రవేశపెట్టారు.

నూతన పార్లమెంట్ భవనంలో ఓటింగ్ జరగడం ఇదే తొలిసారి. ఓటింగ్‌ పూర్తిగా ఎలక్ట్రానిక్ పద్దతిలో జరిగింది. ఆ సమయంలో సభలో ఉన్న సభ్యుల్లో 269 మంది సభ్యులు అనుకూలంగా ఓట్లు వేయగా .. 198 మంది సభ్యులు వ్యతిరేకించారు. సభ్యులకు ఓటింగ్‎ను కాస్ర్ చెక్ చేసుకునే అవకాశం కూడా స్పీకర్‌ కల్పించారు. అలాగే ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్దతిపై అనుమానాలు ఉన్నవాళ్లకు.. పేపర్ స్లిప్‎ల ద్వారా ఓట్ వేసే అవకాశం ఇచ్చారు.

ఈ బిల్లుకు భేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు టీడీపీకి చెందిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలియజేశారు. సృజనాత్మక ఆలోచనలకు టీడీపీ ఎప్పుడూ మద్దతిస్తుందన్నారు. సహకార, సమాఖ్య తత్వానికి తాము అనుకూలమని చెప్పారు. జమిలి ఎన్నికలతో ఖర్చు తగ్గి సామర్థ్యం పెరుగుతుందన్నారు. పోలింగ్‌ శాతం కూడా మెరుగవుతుందని పెమ్మసాని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎన్నికల ఖర్చు రూ.లక్ష కోట్లు దాటుతోందని, నిరంతరం ఎన్నికల నిర్వహణ వల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోందని అభిప్రాయపడ్డారు.

ఈ బిల్లుపై పలు పార్టీల నాయకులు తమ వాదనలను సభముందుకు తెచ్చారు. జమిలి బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని, దీన్ని కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్ తివారీ డిమాండ్‌ చేశారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ఈ బిల్లుతో బిడ్‌ వేస్తున్నారని, జమిలి ఎన్నికలు నియంతృత్వానికి దారితీస్తాయని ఎస్పీ నేత ధర్మేంద్రయాదవ్‌ అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలంటే రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమే అని, ఇది ప్రజాస్వామ్యానికి వైరస్‌ లాంటిదని టీఎంసీ ఎపంఈ కల్యాణ్‌ బెనర్జీ విమర్శించారు. ప్రస్తుతం మనకు కావాల్సింది జమిలి ఎన్నికలు కాదని, ఎన్నికల సంస్కరణలని, గతంలో ఎన్‌జేఏసీ బిల్లును కూడా ఇలాగే చర్చ లేకుండా ఆమోదించుకున్నారని కల్యాణ్‌ బెనర్జీ ఆక్షేపించారు. జమిలి ఎన్నికలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని, ఇవి అధ్యక్ష తరహా పాలనకు దారితీస్తాయని, ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తాయని మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అభిప్రాయపడ్డారు. ఇది రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమే అని, దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షాలకు సంస్కరణలంటే అలర్జీ అని, అందుకే దీన్ని వ్యతిరేకిస్తున్నారని, జమిలి బిల్లుకు మేం పూర్తిగా మద్దతిస్తున్నామని శివసేన ఎంపీ శ్రీకాంత్‌ శిందే వ్యాఖ్యానించారు. ఈ బిల్లును జేపీసీకి పంపడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, క్యాబినెట్‌ సమావేశంలో మోదీ స్వయంగా ఈ సూచన చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇక, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ మాట్లాడుతూ జమిలి ఎన్నికల నిర్వహణ అంశం కొత్తది కాదని, 1983 నుంచి ఈ తరహా ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్‌ ఉందన్నారు. దీనివల్ల రాష్ట్రాల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదన్న ఆయన.. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఇది వ్యతిరేకం కాదని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కాదని స్పష్టం చేశారు. స్వీడన్‌, జర్మనీ వంటి దేశాల్లోనూ జమిలి ఎన్నికలు జరుగుతున్నాయని, రాజకీయ కోణంలోనే ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయని అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ కొట్టిపారేశారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com