– పాజిటివ్‌గా కోవింద్ నివేదిక
– బిల్లుకు కేంద్రమంత్రివర్గం ఆమోదం
– ఎంపీలకు విప్ జారీచేసిన బీజేపీ
– ఒకే అడుగుదూరంలో చట్టం
భారతదేశంలో ఏకీకృత ఎన్నికలకు మార్గం సుగమం అయ్యిందా? ఎన్డీఏ సర్కారుకు నడిపిస్తోన్న బీజేపీ అనుకున్నది సాధించబోతోందా? జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలన్న ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇది ప్రత్యేకమైన బిల్లు. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొంది చట్టరూపం దాల్చితే.. లోక్‌సభకు, దేశంలోని అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. ఈ బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే అంటే.. ఇప్పుడు జరుగుతున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే గురువారం ఉదయం ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన వెంటనే భారతీయ జనతాపార్టీ తన లోక్‌సభ సభ్యులకు విప్ జారీచేసింది. రేపు, ఎల్లుండి అంటే.. 13, 14 తేదీల్లో బీజేపీ ఎంపీలందరూ విధిగా పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాలని పార్టీ ఆదేశాలు జారీచేసింది. అంటే.. ఈ బిల్లును రేపు గానీ, ఎల్లుండి గానీ పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న చర్చ గత కొంత కాలంగా బీజేపీ లేవనెత్తుతోంది. ఈ క్రమంలోనే మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కార్యాచరణ మొదలుపెట్టింది. అసలు జమిలి ఎన్నికలు సాధ్యమేనా? దేశంలో పార్లమెంటులో సహా.. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఏమైనా పాలనాపరమైన, ఇతర ఇబ్బందులు తలెత్తుతాయా? అన్న అంశంపై అధ్యయనం కూడా చేయించింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ శరవేగంగా అధ్యయనం పూర్తిచేసింది. ఇచ్చిన గడువు లోగానే కేంద్రప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ సాధ్యమే అని రామ్‌నాథ్ కోవింద్ కమిటీ స్పష్టం చేసింది. దీంతో, అప్పటినుంచి మోదీ ప్రభుత్వం ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. వచ్చే రెండేళ్లలోనే ఈ జమిలి ఎన్నికల ప్రక్రియను అమలులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే గురువారం ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం ఓ ముందడుగు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే, కేంద్ర మంత్రి మండలి ఆమోదానికి ఒకరోజు ముందు కమిటీ చైర్మన్ రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల నుంచి ముఖ్యంగా రాజకీయ పార్టీల నుంచి ఏకాభిప్రాయం సాధించాలని సూచించారు. ఎందుకంటే ఈ అంశం రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఉందని, దేశానికి ఈ నిర్ణయం ప్రయోజనం చేకూర్చుతుందని అభిప్రాయపడ్డారు. ఇది అమల్లోకి వస్తే.. దేశంలో గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు. ఇది తన అభిప్రాయం మాత్రమే కాదని, దేశంలోని అర్థికవేత్తల అందరి అభిప్రాయమన్నారు. ఇది అమలు అయితే, దేశ జీడీపీ 1 నుంచి 1.5 శాతం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
మొత్తానికి, ఈ ఏడాది సెప్టెంబర్‌లో, 100 రోజుల వ్యవధిలో పట్టణ బాడీ, పంచాయతీ ఎన్నికలతో పాటు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్న ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
క్యాబినెట్ ఆమోదం తర్వాత, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నిర్ణయాన్ని ప్రశంసించారు, ఇది భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు.
అంతేకాదు.. ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. “ఏకకాల ఎన్నికలపై ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులను కేబినెట్ ఆమోదించింది. ఈ ప్రయత్నానికి నాయకత్వం వహించినందుకు మరియు విస్తృత శ్రేణి వాటాదారులను సంప్రదించినందుకు మా మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ జీకి ధన్యవాదాలు. ఇది మన ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తివంతంగా మరియు భాగస్వామ్యవంతంగా మార్చడానికి ఒక ముఖ్యమైన ముందడుగు” అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఇదే అంశంపై బుధవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర అసెంబ్లీలకు మరియు లోక్‌సభకు ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించేందుకు తన మద్దతును ప్రకటించారు. తరచూ ఎన్నికల వల్ల సమయం, ప్రజల నిధులు గణనీయంగా వృధా అవుతాయని అభిప్రాయపడ్డారు. తరచుగా జరిగే ఎన్నికలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు విఘాతం కలిగిస్తాయని, ఫలితంగా ప్రజాధనం భారీగా ఖర్చు అవుతుందని చౌహాన్ పేర్కొన్నారు.
మొత్తానికి తాజా పరిణామాలు కేంద్ర ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఉంటున్నాయి. ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ కాన్సెప్ట్ త్వరలోనే అమలులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.