38.2 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

వైసీపీ పోరుబాట అవంతికి నచ్చలేదా?

బెల్లం చుట్టూ ఈగల్లాగ అధికారం, పదవి, హోదా కి అలవాటు పడిపోయిన నేతలున్న రాజకీయాలివి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ లేని వారూ ఆ పార్టీలోకి క్యూ కట్టారు..ఇప్పుడు టీడీపీ కి ఆ ఛాన్స్ దక్కింది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నేతల కమిట్ మెంట్ తెలుస్తుంది. ఒక్కసారి అధికారం చేజారాక నేతలు కూడా జారుకుంటారు. ఇంద్రుడు, చంద్రుడు అని పొగిడిన అధినేతలోనే నిరంకుశత్వం, పొగరు, అహంకారం కనిపిస్తుంటాయి. పైగా పక్క పార్టీ వారు రారమ్మని పిలుస్తుంటారు. అందుకే అధినేత తీరు సరిగా లేదని, ఓడిపోయినా వాస్తవం గ్రహించడం లేదని నిందలూ, నిష్టూరాలు వేసి మెటికలు విరిచి వెళ్లి పోతుంటారు. ఒకప్పుడు తాము భుజాన వేసుకుని మోసిన పార్టీలోనే ఎక్కడలేని తప్పులు వారికి ఇప్పుడు కనిపిస్తాయి. వైసీపీ అధికారం కోల్పోయాక జగన్ గూటి నుంచి వలసలు పెరిగిపోయాయి. అందరి దారి అధికార పక్షంలోకే. చిన్నా చితకా పదవులు, పరిచయాలు, సంపాదన, పైరవీలు, కాంట్రాక్టులు అన్నీ వచ్చే ఎన్నికలకు పెట్టుబడి మూలధనం ఇవన్నీ.. ఇవికాకుండా మరికొంత మందిని అధికార పక్షం ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో లాగుతుంటుంది. కుల, ప్రాంత రాజకీయ సమీకరణాల లెక్కన. ఏతా వాతా ఈ ప్రభావం అంతా పడేది ప్రతిపక్షం పైనే.. గత పదిహేనేళ్లుగా ఈ తరహా రాజకీయాలు ఒక ట్రెండ్ గా మారాయి. మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇవాళ వైసీపీకి గుడ్ బై కొట్టారు. జాబితా ఈ ఇద్దరు నేతలతో ఆగకపోవచ్చు. లిస్టు మరింత పెద్దదే కావొచ్చు.. నాయకులు వెళ్లి పోతే ఏమైంది? కొత్త వారిని తయారు చేసుకుందాం అని జగన్ బాలినేని వెళిపోయినప్పుడే స్పష్టంచేశారు. ఈ విషయంపై ఆయనకు పూర్తి క్లారిటీ ఉంది.

దూకుడుగా పోవద్దా?

వైసీపీ ఈ మధ్య కాస్త జోరు పెంచి ప్రజలలో ఉంటూ ప్రత్యక్ష పోరాటాల పంథాకి వచ్చేసింది. అయితే ఈ దూకుడు పంథాను మాత్రం అవంతి వ్యతిరేకిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి ఐదేళ్లు పాలించమని జనం తీర్పు చెప్పారని, ఐదు నెలలైనా గడవకుండా జగన్ మళ్లీ పోరాటాలు చేయాలంటూ పిలుపు నివ్వడం తప్పన్నది అవంతి వాదన. తాడేపల్లిలో కూర్చుని జగన్ ఆదేశాలిస్తారని వాటిని అమలు చేయాలంటే కిందిస్థాయి కార్యకర్తలు నలిగిపోతున్నారని ,ప్రజాస్వామ్య బద్ధంగా పార్టీ వ్యవహరించలేదని అన్నారు.గత ఐదేళ్లుగా ఇదే తీరని అవంతి తన రాజీనామా లేఖలో అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ పోరాట పంథా ఆయనకు నచ్చడం లేదా? లేక కూటమి ప్రభుత్వం దర్యాప్తులు, విచారణల పేరుతో చేస్తున్న హడావుడి చూసి ముందు జాగ్రత్తపడుతున్నారా? ఉత్తరాంధ్రలో అవంతి మీద కూడా అనేక భూ కబ్జా ఆరోపణలున్నాయి. విశాఖలో వైసీపీ కేడర్ ను ఆయన లెక్క చేయకుండా నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. ఇప్పుడు పోరుబాట అంటే ఆ కేడర్ కలసి రాదని తెలిసి ముందే ఈ రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారా?

అదంత ఈజీ కాదు..

ఉత్తరాంధ్రకు ప్రాతినిధ్యం వహిస్తున్నఅవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేయగానే బెజవాడలో ఉన్న బుద్దా వెంకన్న ఘాటుగా స్పందించారు. ఉత్తరాంధ్ర ద్రోహి అని, రాజకీయ జన్మనిచ్చిన ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి కుటుంబానికి ద్రోహం చేశారని, ఢిల్లీలో నిలబెట్టిన చంద్రబాబును అవమానించారని జగన్ పంచన చేరి దోచుకు తిన్నారని ఇలా… ఘాటైన విమర్శలు చేశారు. కాబట్టి అవంతికి టీడీపీలో ఎంట్రీ అంత సులభం కాకపోవచ్చు. అవంతి జనసేన లో చేరడం కూడా అంత సులభం కాదు.. కారణం ప్రజారాజ్యం పార్టీ సమయంలో నేతలను పవన్ కల్యాణ్ అంత సులభంగా చేర్చుకోరు. అప్పట్లో మెగాస్టార్ ను తప్పుదోవ పట్టించారన్న కోపం పవన్ కు ఉండనే ఉంది.
అదీగాక కూటమి ఎన్నికల ప్రచారం టైములోనే పార్టీలోకి ఎవరిని పడితే వారిని చేర్చుకుని ఎన్నో లెక్కలేనన్ని హామీలిచ్చింది టీడీపీ. ఆ ఆశావహులంతా క్యూలో ఉన్నారు.. ఇపుడు తాజాగా చేరిన నేతలకు పెద్ద పీట వేస్తే ఆశావహులకు కోపాలొస్తాయి. ఇన్నాళ్లూ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న నేతల అహం దెబ్బతింటుంది. ఫలితం ద్వితీయ శ్రేణి కేడర్ తిరగబడుతుంది. గతంలో బాలినేని శ్రీనివాస్ టీడీపీలో చేరదామనుకుని ఆ పార్టీ నేతలు తిరగబడటంతో చివరికి జనసేనలో చేరారు. ఇప్పుడాయన పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడినట్లయ్యింది. అధికార పార్టీ నేత దామచర్ల జనార్ధన్ బాలినేనికి చుక్కలు చూపిస్తున్నారు. మరోవైపు తిరిగి సొంత గూటికే వద్దామనుకున్నా ఇప్పుడు వైసీపీ స్థానిక కేడర్ మళ్లీ తీసుకోవద్దని తెగేసి చెప్పింది. వైసీపీని వీడే నేతలకి టీడీపీ లేదా జనసేనలో ఇమడటం కూడా అంత సులభం కాదు. ప్రస్తుతానికి జనసేన సేఫ్ గూడులా కనిపిస్తున్నా.. ఎన్నికల నాటికి సీన్ ఎలా మారుతుందో తెలీదు. కూటమి ఐక్యత అప్పటికి ఎలా ఉంటుందో కూడా చెప్పలేం. కాబట్టి పార్టీ మారే నేతలు ఇవన్నీ ఆలోచించుకోవాల్సిందే..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com