36.2 C
Hyderabad
Saturday, May 30, 2026

Live Video

spot_img

ప్రత్యేక రాష్ట్రంలో పార్టీల వారిగా తెలంగాణ తల్లి

తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు రాజకీయాల్లో కొత్త సంకేతాలకు దారితీస్తున్నాయి. తెలంగాణ సమాజానికి ప్రతీకగా…సగటు మహిళ, తల్లి, చెల్లి, నానమ్మ మన ఇంటి వ్యక్తిగా కొత్త విగ్రహం ప్రతిబింబిస్తోందని కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వం వాదిస్తోంది.

తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీసేవిధంగా విగ్రహంలో మార్పులు చేశారని బీఆర్ ఎస్ నేతలు ఘాటుగా విమర్శిస్తున్నారు. మార్పుల పేరుతో రేవంత్ రెడ్డి కుమార్తె ముఖ కవళికలు రుద్దారని కొందరు ఆరోపణలు చేశారు. చేతిలో బతుకమ్మ ఉంటే బాగుండు అని బిజెపి నేతలు వాదిస్తున్నారు. బతుకమ్మ లేకపోవడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచటమే అని ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

తాజా పరిణామాలతో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక తెలంగాణ తల్లి, బీఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరో తెలంగాణ తల్లి అన్నట్టుగా రాజకీయాలు సాగుతున్నాయి. ఏ తల్లిని ఎంచుకోవాలో తెలియక కమలనాథులు అనాథలుగా మిగిలినట్టయింది. బిజెపిలో ఉత్తర, దక్షిణ తెలంగాణ నేతల మధ్య ఈ ఆంశంలో భేదాభిప్రాయాలు ఉన్నట్టు కనిపిస్తోంది. కేవలం ఉత్తర తెలంగాణ నేతలే విగ్రహంలో మార్పులపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో దక్షిణ తెలంగాణ నేతలు కిమ్మనటం లేదు.

ప్రభుత్వం అధికారికంగా సచివాలయంలో తెలంగాణ విగ్రహవిష్కరణ కార్యక్రమం నిర్వహించింది. ఇదే సమయంలో బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ మేడ్చెల్ లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసి పాలభిషేకం చేశారు.

అయితే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎవరైనా అవమానించే విధంగా వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు సమయంలో ఉద్యమ నేతగా కెసిఆర్ మేధావులతో చర్చలు జరిపారు. ప్రొఫెసర్ జయశంకర్ నుంచి అప్పుడు జెఏసి నేతగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్సీ కోదండరాం వరకు ఆనాటి నిర్ణయంలో భాగస్వాములే. ఆ తర్వాతే విగ్రహానికి తుది రూపు ఖరారు చేశారు.

ఇదంతా ఒక వైపు జరుగుతుంటే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ దినోత్సవం రోజే… కాంగ్రెస్ ఆధినాయకురాలు సోనియాగాంధీ జన్మదినం కావడం గమనార్హం. తెలంగాణ తల్లి పేరుతో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు జరుపుకునేందుకు చాన్స్ వచ్చిందని కాంగ్రెస్ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంలో కెటిఆర్ సంచలనమైన కామెంట్స్ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని…. బీఆర్ ఎస్ అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాలు ఉన్న చోటల్లా తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు.

రెండు పార్టీలు ఈ విధంగా పంతాలకు పోతే తమిళనాడు రాజకీయాలకు తెలంగాణ రాజకీయాలకు పెద్ద తేడా ఉండదని రాజకీయ విశ్లషకులు హెచ్చరిస్తున్నారు.

ఈ విధంగా రాజకీయంగా పార్టీలు దుమ్మెత్తిపోసుకోవడం ఇలా జరుగుతుంటే సగటు తెలంగాణ పౌరుడు అసలు రాష్ట్ర విభజన లక్ష్యం ఎటువైపు వెళుతుందో అని మదన పడుతున్నాడు. రాబోయే రోజుల్లో ఏ రాజకీయ పార్టీ తెలంగాణ తల్లికి నీరాజనాలు పలుకాలో తెలియని సందిగ్ధం నెలకొంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com